హైదరాబాద్‌ షూటింగ్‌ సెట్‌లో గాయపడిన బాలీవుడ్‌ డైరెక్టర్‌

Rohit Shetty injured during shoot in Hyderabad, underwent 'minor surgery'. బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి తన వెబ్ సిరీస్ 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' చిత్రీకరణ

By అంజి  Published on  7 Jan 2023 6:47 PM IST
హైదరాబాద్‌ షూటింగ్‌ సెట్‌లో గాయపడిన బాలీవుడ్‌ డైరెక్టర్‌

బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి తన వెబ్ సిరీస్ 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' చిత్రీకరణ సమయంలో గాయపడ్డారు. ఈ ఘటన శనివారం హైదరాబాద్‌లో జరిగింది. నగర శివార్లలోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతున్నప్పుడు దర్శకుడి చేతికి గాయమైంది. కామినేని హాస్పిటల్‌లో చేరిన రోహిత్‌ శెట్టికి వైద్యులు చిన్నపాటి సర్జరీ చేశారు. అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. తెలిసిన వివరాల ప్రకారం.. కార్ చేజ్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తున్నప్పుడు రోహిత్ శెట్టి గాయపడ్డాడు. ప్రొడక్షన్ టీం వెంటనే కామినేని ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యుల బృందం మైనర్ సర్జరీ చేసింది.

ప్రతిష్టాత్మక కాప్ వెబ్ షో 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. కీలక షెడ్యూల్ కోసం భారీ సెట్‌ని వేసినట్లు సమాచారం. షూట్‌లో కార్ చేజ్ సీక్వెన్సులు, ఇతర హై-ఆక్టేన్ యాక్షన్, స్టంట్ సన్నివేశాలు ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమయ్యే ఈ వెబ్‌సిరీస్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్న సిద్ధార్థ్ మల్హోత్రా, ఇతర ముఖ్య నటీనటులు షూట్‌లో పాల్గొంటున్నారు. గత ఏడాది మేలో గోవాలో 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' షూటింగ్ సందర్భంగా సిద్ధార్థ్ మల్హోత్రాకు స్వల్ప గాయమైంది. ఈ సిరీస్‌లో వివేక్ ఒబెరాయ్, శిల్పాశెట్టి కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Next Story