కృష్ణంరాజుకి ఇదేనా మీరిచ్చే వీడ్కోలు.. సిగ్గు! సిగ్గు!

RGV's sensational comments regarding Krishnamraj's farewell. దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ.. ఎప్పుడూ వివాదాల్లో మునిగి తేలుతుంటారు. ఆయనకు వివాదాలను కొని తెచ్చుకోవడం కొత్తేమీ కాదు.

By అంజి  Published on  12 Sept 2022 9:07 AM IST
కృష్ణంరాజుకి ఇదేనా మీరిచ్చే వీడ్కోలు.. సిగ్గు! సిగ్గు!

దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ.. ఎప్పుడూ వివాదాల్లో మునిగి తేలుతుంటారు. ఆయనకు వివాదాలను కొని తెచ్చుకోవడం కొత్తేమీ కాదు. తాజాగా ఆర్జీవీ తన ట్విటర్‌ ద్వారా సినిమా పెద్దలను టార్గెట్‌గా చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి. . సీనియర్‌ నటుడు, నిర్మాత కృష్ణంరాజు ఆదివారం అనారోగ్యం కారణంగా మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సినీ పెద్దలు, ఇతర నటీనటులు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు. ఇవాళ మధ్యాహ్నం కృష్ణంరాజు అంత్యక్రియలు జరగనున్నాయి. కృష్ణంరాజు అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు.

ఈ నేపథ్యంలోనే వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ.. కృష్ణంరాజుకు సినిమా పరిశ్రమ సరైన వీడ్కోలు ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. అత్యంత స్వార్ధపూరిత సినిమా పరిశ్రమ ఇదేనని, సినీ పెద్ద‌లైన కృష్ణ‌, ముర‌ళీ మోహ‌న్‌, చిరంజీవి, మోహ‌న్‌బాబు, బాల‌కృష్ణ‌, ప్ర‌భాస్‌, మ‌హేష్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌పై ఆర్జీవీ కామెంట్స్‌ చేశారు.

''భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు లాంటి అత్యంత గొప్ప చిత్రాలని అందించిన మహా నటుడు, గొప్ప నిర్మాత కోసం ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్ధపూరిత తెలుగు సినిమా పరిశ్రమ కి నా జోహార్లు. సిగ్గు! సిగ్గు!. కృష్ణ, మురళీమోహన్‌కి, చిరంజీవికి, మోహనబాబుకి, బాలయ్యకి , ప్రభాస్ కి, మహేష్, కల్యాణ్‌కి నేను ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే.. రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది.'' అంటూ ఆర్జీవీ ట్విటర్‌ వేదికగా వ్యాఖ్యానించారు.

''మనసు లేకపోయినా ఓకే. కనీసం మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్దమనిషికి విలువ ఇద్దాం .. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతోంది అని నెలరోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనది. మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్దమనిషికి విలువ ఇద్దాం .. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం.'' అంటూ ఆర్జీవీ ట్వీట్‌ చేశారు. అయితే ఆర్జీవీ చేసిన ట్వీట్లపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. మరీ ఆయన మాటాలను సినిమా పెద్దలు ఎలా తీసుకుంటారో చూడాల్సి ఉంది.

Next Story