Video: వీధి కుక్కలను చంపడంపై తీవ్రస్థాయిలో స్పందించిన రేణు దేశాయ్

వీధి కుక్కలను చంపడంపై సినీనటి, జంతు ప్రేమికురాలు రేణు దేశాయ్ తీవ్రస్థాయిలో స్పందించారు

By -  Knakam Karthik
Published on : 19 Jan 2026 3:13 PM IST

Cinema News, Tollywood, Renu Desai, Stray Dogs, Supreme Court

Video: వీధి కుక్కలను చంపడంపై తీవ్రస్థాయిలో స్పందించిన రేణు దేశాయ్

హైదరాబాద్: వీధి కుక్కలను చంపడంపై సినీనటి, జంతు ప్రేమికురాలు రేణు దేశాయ్ తీవ్రస్థాయిలో స్పందించారు. కేవలం కుక్కల వల్ల మృతి చెందిన వాటినే ప్రాణాలుగా పరిగణిస్తూ రోడ్డు ప్రమాదాలు దోమలతో చనిపోయిన వారివి ప్రాణాలు కాదా అని ప్రశ్నించారు. 100 కుక్కలలో ఐదు కుక్కలు మాత్రమే అగ్రెసివ్‌గా స్వభావం కలిగి ఉంటాయని అన్నారు. అలాంటి ఐదు కుక్కల కోసం మిగిలిన 95 కుక్కలను చంపుతారా అంటూ ప్రశ్నించారు. ఈ భూమిపై ప్రతి జీవికి జీవించే హక్కు ఉందని నిస్సహాయతతో ఉన్న కుక్కలను దారుణంగా చంపడం దారుణమని అన్నారు. కాలభైరవుడిగా పూజలు అందుకుంటున్న శునకాలను ఎలా హత్య చేయాలనిపిస్తుంది అని ప్రశ్నించారు. ప్రభుత్వాల వైఫల్యాల వల్లనే వీధి కుక్కల ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏ బి సి, వ్యాక్సినేషన్స్ వేస్తే పరిష్కారమయ్యే సమస్యను జటిలం చేసి కుక్కలు మరణాలకు కారణం అవుతున్నారని మండిపడ్డారు.

దేశంలో ప్రతినిత్యం రోడ్డు ప్రమాదాలు, దోమ కాటుతో మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు ఎన్నో, మానవత్వం వీడి కుటుంబ సభ్యులనే హతమరుస్తున్న సంఘటనలో లక్షలాది ప్రాణాలు పోతున్నాయని అన్నారు. వాటన్నిటినీ వదిలిపెట్టి కేవలం కుక్కల వల్ల చనిపోయిన ప్రాణాలను మాత్రమే ప్రాణాలుగా పరిగణిస్తే ఎలా అని నిలదీశారు. తనకు 45 సంవత్సరాలు వచ్చాయని ఇప్పటివరకు ఏ వీధి కుక్క తనపై దాడికి పాల్పడలేదని చెప్పారు.

దేశ అత్యున్నత న్యాయస్థానం ఒక రకమైన తీర్పులను వెలువరిస్తే వాటిని మరోరకంగా అర్థం చేసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుడు విధానాలతో కుక్కలను పూర్తిగా సంహరించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి అని మండిపడ్డారు. భారత దేశంలో వేస్ట్ మేనేజ్మెంట్ సక్రమంగా నిర్వహించకపోవడంతోనే కుక్కలు పిల్లలకు జన్మనిస్తూ అధికమవుతున్నాయని అన్నారు. ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు సక్రమంగా తీసుకోకపోవడం వల్ల ఎదురయ్యే సమస్యను కుక్కలను చంపడంతో పరిష్కరిద్దాం అనుకోవడం మంచిది కాదని సూచించారు. ప్రభుత్వాలైనా, వ్యక్తులైన అన్యాయంగా శునకాలను హత్య చేసే కార్యక్రమాలకు తక్షణమే ముగింపు పలకాలని డిమాండ్ చేశారు.

Next Story