సినీ నటి రేణు దేశాయ్ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న అసభ్యకరమైన దాడులు, వేధింపులపై ఆమె అధికారికంగా ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తులు తన పోస్టులపై అత్యంత అసభ్యకరంగా, అవమానకరంగా కామెంట్లు చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ తరహా దూషణల వల్ల తాను వ్యక్తిగతంగా, సామాజికంగా ఎంతో మానసిక వేదనకు గురవుతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ ఇతరుల వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్న వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. రేణు దేశాయ్ ఫిర్యాదును స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుల ఐపీ అడ్రస్‌లు, సోషల్ మీడియా ఖాతాల వివరాలను సేకరిస్తున్నారు. నిందితులను గుర్తించి త్వరలోనే చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ప్రముఖులపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మరియు అసభ్యకర వ్యాఖ్యలు మితిమీరుతున్న తరుణంలో రేణు దేశాయ్ తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.