హీరోయిన్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ది గర్ల్‌ఫ్రెండ్'. ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. 'ది గర్ల్‌ఫ్రెండ్'లో నటి రష్మిక మందన్న, నటుడు ధీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుందని నిర్మాతలు శనివారం ప్రకటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ చిత్రాన్ని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది.
తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో ఈ సినిమా రిలీజ్ కానుంది. సినిమా విడుదల తేదీ ప్రకటన చేయడానికి మేకర్స్ ఒక ప్రోమో వీడియోను కూడా విడుదల చేశారు. విడుదలైన ప్రోమోలో, రష్మిక తన ప్రియుడితో భోజనం చేస్తూ మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. రాహుల్ రవీంద్రన్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం మరియు కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ అందించారు.