విషాదం.. యువ ర్యాపర్ ని కాల్చి చంపిన దుండగులు
Rapper Young Dolph fatally shot at Tennessee cookie shop.అమెరికాలో గన్ కల్చర్ పెరిగిపోతుంది. దీంతో అనేక మంది ప్రాణాలు
By తోట వంశీ కుమార్ Published on 18 Nov 2021 10:20 AM ISTఅమెరికాలో గన్ కల్చర్ పెరిగిపోతుంది. దీంతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ ర్యాపర్ పై దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ర్యాపర్ అక్కడిక్కడికే మృతి చెందాడు. ఈ ఘటన టెన్నెస్సీ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మెంఫిస్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని కుకీ షాపులో ప్రముఖ ర్యాపర్ యంగ్ డాల్ఫ్ (36) ఉండగా.. ఓ దుండగుడు అతడిని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడ్డాడు.
దీంతో కుప్పకూలిన డాల్ప్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కేన్సర్‌తో బాధపడుతున్న తన బంధువురాలిని చూసేందుకు మెంఫిస్‌కు వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగిందని అతడి సోదరి మరేనో మయర్స్ చెప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అయితే.. అప్పటికే దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దుండగుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై మెంఫిస్ మేయర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. యంగ్ డాల్ఫ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
చికాగో నగరంలో 27 జూలై 1985లో యంగ్ డాల్ఫ్ జన్మించాడు. అతడి అసలు పేరు అడాల్ఫ్ రాబర్ట్ థోర్నటన్. 2008 నుంచి ర్యాపర్‌గా కెరీర్ ను ప్రారంభించాడు. గత ఏడాది అతడు రూపొందించిన 'రిచ్ స్లేవ్' ఆల్బమ్‌కు బిల్‌బోర్డ్ టాప్ 200 లిస్ట్‌లో స్థానం లభించింది. 'పేపర్ రూట్ కాంపేన్', 'కింగ్ ఆఫ్ మెంఫిస్', 'రిచ్ స్లేవ్', తదితర ఆల్బమ్స్ ప్రజాదరణ పొందాయి. కాగా.. డాల్ప్‌పై గతంలో కాల్పులు జరిగాయి. 2017లో కూడా డాల్ఫ్ ను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరుపగా.. తృటిలో అతడు తప్పించుకున్నాడు. కానీ ఈ సారి దుండగుడు దగ్గరి నుంచి కాల్పులు జరపడంతో తల, మెడ, ఛాతిలోకి బుల్లెట్లు దూసుకువెళ్లడంతో డాల్ప్ కన్నుమూశాడు.