Rajinikanth donates Rs 50 lakh to Tamil Nadu CM Relief Fund. సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా సీఎం స్టాలిన్ కార్యాలయానికి వెళ్లి రూ.50 లక్షల చెక్కు అందజేయగా, తాజాగా నటుడు విక్రమ్ కూడా తనవంతు విరాళం ప్రకటించారు.
By Medi Samrat Published on 17 May 2021 10:24 AM GMT
దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. మహమ్మారి విజృంభణతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వేల సంఖ్యలో ఆసుపత్రి పాలవుతున్నారు. వందల మంది మృత్యువాత పడుతున్నారు. ఇంకొందరు తమవారిని కోల్పోయి అనాధలుగా మిగిలిపోతున్నారు. ఖరీదైన వైద్యం చేయించుకోలేక మరి కొందరు విలవిలలాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలను ఆదుకోవడానికి సెలబ్రిటీ లు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు.
తమిళనాడు రాష్ట్రంలో కరోనా బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో విరివిగా విరాళాలు ఇవ్వాలని సీఎం స్టాలిన్ ఇటీవలే బహిరంగ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో అక్కడి సీయం సహాయ నిధికి భారీగా విరాళాలు అందుతున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా సీఎం స్టాలిన్ కార్యాలయానికి వెళ్లి రూ.50 లక్షల చెక్కు అందజేయగా, తాజాగా నటుడు విక్రమ్ కూడా తనవంతు విరాళం ప్రకటించారు. ఆన్ లైన్ ద్వారా 30 లక్షల రూపాయలను తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి అందచేశారు. ఇప్పటికే అజిత్ 25 లక్షలు , దర్శకుడు ఎఆర్ మురుగదాస్ 25 లక్షలు, రజనీకాంత్ కుమార్తె సౌందర్య కోటి రూపాయలు , హీరో సూర్య సోదరులు కోటి రూపాయలు విరాళాలు ఇచ్చారు. అలాగే దర్శకుడు వెట్రిమారన్, ఎడిటర్ మోహన్, జయం రవి, దర్శకులు శంకర్ లు ఒక్కోరుగా రూ. 10 లక్షల రూపాయలు, తమిళ నటుడు శివ కార్తికేయన్ విరాళం కింద పాతిక లక్షలు అందించారు.