భూమి వివాదంలో సినీ నటుడు రాజీవ్ కనకాలకు పోలీసుల నోటీసులు

భూమి అమ్మకం వివాదంలో సినీ నటుడు రాజీవ్ కనకాలకు రాచకొండ పోలీసులు నోటీసు జారీ చేశారు.

By Knakam Karthik
Published on : 24 July 2025 10:40 AM IST

Cinema News, Hyderabad, Actor Rajeev Kanakala, Rachakonda police, Land Sale Dispute

భూమి వివాదంలో సినీ నటుడు రాజీవ్ కనకాలకు పోలీసుల నోటీసులు

భూమి అమ్మకం వివాదంలో సినీ నటుడు రాజీవ్ కనకాలకు రాచకొండ పోలీసులు నోటీసు జారీ చేశారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో సినీ నిర్మాత విజయ్ చౌదరిపై కూడా కేసు నమోదైంది. ఫిర్యాదు ప్రకారం..హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ, పసుమాముల రెవెన్యూ పరిధిలోని సర్వే నెం. 421 వెంచర్‌లో రాజీవ్ కనకాలకు ఓ ఫ్లాట్ ఉంది. ఈ ఫ్లాట్‌ను ఆయన కొన్ని నెలల క్రితం విజయ్ చౌదరికి విక్రయించారు. అధికారిక రిజిస్ట్రేషన్ కూడా జరిగిన‌ట్లు తెలుస్తోంది.

అయితే, విజయ్ చౌదరి అదే ఫ్లాట్‌ను ఎల్బీనగర్‌కు చెందిన శ్రవణ్ రెడ్డి అనే వ్యక్తికి రూ. 70 లక్షలకు విక్రయించారు. కానీ, ఆ తర్వాత అసలు సమస్య మొదలైంది. ఇటీవ‌ల శ్రవణ్ రెడ్డి తన ఫ్లాట్‌ను పరిశీలించేందుకు వెళ్లినప్పుడు, సదరు ప్లాట్ ఎక్కడా కనిపించకపోవడం, ఆ స్థలంలో ఆనవాళ్లు లేకపోవడం గమనించారు. తనను నకిలీ స్థలంతో మోసగించారన్న అనుమానంతో విజయ్ చౌదరిని సంప్రదించారు.

అయితే, దీనిపై వివాదం నడుస్తోందని, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందామ‌ని చెప్పి తప్పించుకున్నాడని సమాచారం. గ‌ట్టిగా అడిగితే అంతు చూస్తాన‌ని బెదిరించిన‌ట్లు శ్రవణ్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు విజయ్ చౌదరిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ముందుగా స్థలాన్ని విక్రయించిన రాజీవ్ కనకాల పాత్రను పరిశీలించేందుకు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ ఫ్లాట్ లావాదేవీలో రాజీవ్ పాత్రపై స్పష్టత రావాల్సి ఉంది.

Next Story