పంజాబ్ ప్రభుత్వం మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పింది. తమ రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అంటే రేపటి నుంచి ఈ అవకాశం కల్పించనున్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించారు.
ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 1.31 కోట్ల మంది మహిళలు, బాలికలు ప్రయోజనం పొందనున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని బుధవారం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఉచిత ప్రయాణానికి సంబంధించిన ఒక ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో మహిళలందరికీ ప్రభుత్వానికి చెందిన బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అనుమతిస్తూ ముందకు తెచ్చిన ప్రతిపాదనకు రాష్ట్ర కేబినేట్ ఆమోదం పొందడం హర్షనీయమని రాసుకొచ్చారు. మహిళా సాధికారతకు ఇది బలమైన అడుగు అని నేను భావిస్తున్నాను. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం చాలా ఆనందంగా కూడా ఉందని ట్వీట్ చేశారు.