ఆ నలుగురిలో నేను లేను, ఈ టైమ్‌లో అలా చేయడం కరెక్ట్ కాదు: అల్లు అరవింద్
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇటీవల జరిగిన పరిస్థితులపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తాజాగా స్పందించారు.
By Knakam Karthik
ఆ నలుగురిలో నేను లేను, ఈ టైమ్‌లో అలా చేయడం కరెక్ట్ కాదు: అల్లు అరవింద్
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇటీవల జరిగిన పరిస్థితులపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తాజాగా స్పందించారు. హైదరాబాద్‌లో ఆదివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక విషయాలను ఆయన షేర్ చేసుకున్నారు. సినిమాలు తీయడమే తన వృత్తి అని అన్నారు. గత రెండు రోజులుగా 'ఆ నలుగురు' అంటూ వస్తున్న వార్తలపై అరవింద్ స్పందించారు. ఆ నలుగురిలో తాను లేనని ఆయన స్పష్టం చేశారు.
ఆ నలుగురిలో నేను లేను
'ఆ నలుగురు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ నలుగురు వ్యాపారం నుంచి ఎప్పుడో బయటకు వచ్చాను. ఆ నలుగురిలో నన్ను కలపవద్దు. ఆ నలుగురు కాస్తా ఇప్పుడు 10 మంది అయ్యారు. సినిమాలు తీయడమే నా వృత్తి. గత 50 ఏళ్లుగా సినిమాలు తీసే వృత్తిలోనే ఉన్నాను. తెలంగాణలో ప్రస్తుతం నాకు ఒక్క థియేటర్ కూడా లీజ్‌లో లేదు. అటు ఏపీలో కూడా ఒక్కొక్కటిగా వదులుకుంటున్నాం. ప్రస్తుతం మాకు 15 థియేటర్లు మాత్రమే ఉన్నాయి. అవి కూడా లీజు ముగిశాక రెన్యువల్ చేయొద్దని మా వాళ్లకు చెబుతుంటాను'
అలాగే థియేటర్లు మూసివేస్తామన్న ప్రచారంపైనా ఆయన మాట్లాడారు. ఒకటో తేదీ నుంచి థియేటర్లు మూసేస్తామని ఏకపక్షంగా ఎలా అంటారని ప్రశ్నించారు. 'జూన్ 1 నుంచి థియేటర్లు మూసేస్తామనే ఎగ్జిబిటర్ల నిర్ణయంపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ స్పందన సమంజసమైనదే. తాజాగా జరిగిన సమావేశానికీ నేను వెళ్లలేదు. నేనే కాదు 'గీతా ఆర్ట్స్' డిస్ట్రిబ్యూటర్లు, అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్‌ను కూడా వెళ్లొద్దని చెప్పాను. ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలా సమస్యలు ఉన్నాయి. అందరూ వచ్చి ఏం చేయాలనేది చర్చించాలి' అని అల్లు అరవింద్ అన్నారు.