సలార్' ప్రీ రిలీజ్ బిజినెస్.. రిలీజ్‌కు ముందే ప్రభాస్ మూవీ రికార్డులు!
ప్రభాస్ నటించిన భారీ అంచనాల చిత్రం "సలార్". "ఆదిపురుష్" సినిమా ప్లాఫ్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమా దృష్టిని ఆకర్షించింది.
By అంజి Published on 26 Oct 2023 11:38 AM IST'సలార్' ప్రీ రిలీజ్ బిజినెస్.. రిలీజ్‌కు ముందే ప్రభాస్ మూవీ రికార్డులు!
ప్రభాస్ నటించిన భారీ అంచనాల చిత్రం "సలార్". "ఆదిపురుష్" సినిమా ప్లాఫ్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమా దృష్టిని ఆకర్షించింది. డిసెంబర్‌లో విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద షారూఖ్ ఖాన్ నటించిన "దుంకీ"తో ఢీకొననుంది. "బాహుబలి 2: ది కన్‌క్లూజన్" తర్వాత ప్రభాస్‌కు సరైన హిట్ పడలేదు. బాహుబలి తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమాలు మాత్రం తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఈ సినిమాతోనైనా తిరిగి హిట్ కొట్టాలని ప్రభాస్ చూస్తున్నాడు.
"రాధే శ్యామ్", "ఆదిపురుష్" చిత్రాలతో ప్రభాస్ ఇటీవలి పరాజయాలను ఎదుర్కొన్నప్పటికీ, 'సలార్' చిత్రం విపరీతమైన బజ్‌ను సృష్టించింది. కే జి ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తోన్న 'సలార్' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా మొదటి పార్ట్ ఫైనల్ గా డిసెంబర్‌లో విడుదల కాదానికి రెడీ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో చేసిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ అమ్మకాలతో రికార్డ్ బద్దలు కొట్టింది, వివిధ ప్రాంతాలలో డిస్ట్రిబ్యూటర్లు గణనీయమైన డీల్స్‌ను దక్కించుకున్నారు. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. నైజాం రీజియన్ హక్కులను మైత్రి మూవీస్ ఎన్నారై రూ.65 కోట్లకు దక్కించుకుంది. అభిషేక్ రెడ్డి సీడెడ్ హక్కులను రూ.27 కోట్లకు కొనుగోలు చేయగా, ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి హక్కులు వరుసగా రూ. 20.40 కోట్లకు, రూ.13.60 కోట్లకు అమ్ముడయ్యాయి. గుంటూరు, నెల్లూరులో థియేట్రికల్ రైట్స్ రూ. 12 కోట్లు, రూ. 6.30 కోట్లకు లాక్ అయ్యాయి. పశ్చిమ గోదావరి, కృష్ణా రీజియన్ ల డీల్ ఇంకా లాక్ కాలేదు, అయితే రూ. 19 కోట్లకు అంచనా వేయబడింది. దీంతో సలార్ ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ.163.30 కోట్లకు చేరిపోయింది. థియేట్రికల్ హక్కుల అమ్మకం ద్వారా దాదాపు రూ.165 కోట్లకు చేరువైన ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈ చిత్రం ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణలలో 200 కోట్ల కలెక్షన్ మార్క్‌ను అధిగమించనుంది.