ప్రముఖ సింగర్ బాలసరస్వతి కన్నుమూత
తొలి తెలుగు నేపథ్య గాయనిగా గుర్తింపు పొందిన రావు బాలసరస్వతి తుదిశ్వాస విడిచారు.
By - అంజి |
ప్రముఖ సింగర్ బాలసరస్వతి కన్నుమూత
తొలి తెలుగు నేపథ్య గాయనిగా గుర్తింపు పొందిన రావు బాలసరస్వతి తుదిశ్వాస విడిచారు. ఆమె వయస్సు 97 సంవత్సరాలు. ఇవాళ ఉదయం ఆమె కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. 1928లో వెంకటగిరిలో జన్మించిన ఆమె ఆకాశవాణి కార్యక్రమంతో తెలుగు ప్రజలకు పరిచయం అయ్యారు. 'సతీ అనసూయ' సినిమాలో తొలి పాట పాడారు. ఆరేళ్ల వయసు నుంచే పాడటం మొదలుపెట్టిన బాలసరస్వతి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ తదితర భాషల్లో 2 వేలకుపైగా పాటలు ఆలపించారు.
బాలసరస్వతి పలు సినిమాల్లో కూడా నటించారు. 1936లో సి. పుల్లయ్య దర్శకత్వం వహించిన సతి అనసూయ, భక్త ధ్రువ చిత్రాలలో కూడా పాడారు. ఆమె ప్రతిభను గమనించిన దర్శకుడు కె. సుబ్రమణ్యం ఆమెను తమిళ చిత్రాలలో నటించమని ఆహ్వానించారు. తరువాతి సంవత్సరాల్లో, ఆమె భక్త కుచేల (1936), బాలయోగిని (1937), తిరునీలకాంతర్ (1939) వంటి తమిళ చిత్రాలలో నటించారు. ఆమె తుకారం (1938) సినిమాలో తుకారం కుమార్తె పాత్రను పోషించింది . తుకారం పాత్రను తమిళ వెర్షన్‌లో ముసిరి సుబ్రమణ్య అయ్యర్, తెలుగు వెర్షన్‌లో సి.ఎస్.ఆర్. ఆంజనేయులు పోషించారు. 1940లో, ఆమె గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వం వహించిన ఇల్లాలు చిత్రంలో ఎస్. రాజేశ్వరరావుతో కలిసి నటించింది .