సినీ పరిశ్రమను విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. నందమూరి తారకరత్న మరణాన్ని జీర్ణించుకోలేకముందే మరో దిగ్గజం కన్నుమూశారు. టాలీవుడ్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు ఎడిటర్‌గా పని చేసిన జి.జి కృష్ణారావు ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
జి.కృష్ణారావు ఎడిటర్‌గా మూడు వందలకు పైగా చిత్రాలకు పని చేశారు. టాలీవుడ్‌లో దాసరి నారాయణరావు, కె. విశ్వనాథ్, బాపు, జంధ్యాల వంటి దిగ్గజ దర్శకుల చిత్రాలకు పని చేసి ప్రశంసలు, పలు అవార్డులు అందుకున్నారు. ముఖ్యంగా కె.విశ్వానాథ్ తెరకెక్కించిన 'శంకరాభరణం', 'సాగరసంగమం', 'స్వాతిముత్యం', 'సిరివెన్నెల', 'సూత్రధారులు', 'శుభసంకల్పం', 'స్వరాభిషేకం' వంటి ఆణిముత్యాలైన చిత్రాలకు ఎడిటర్‌గా పని చేశారు.
అంతేకాకుండా దాసరి నారాయణరావు తెరకెక్కించిన 'బొబ్బిలి పులి', 'సర్దార్ పాపారాయుడు' వంటి సినిమాలకు పని చేసిన అనుభవం ఆయన సొంతం.