విషాదం.. ప్రముఖ పాప్ సింగర్ కన్నుమూత
Pop singer Tarsame Singh Saini aka Taz passes away at 54
By తోట వంశీ కుమార్
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ పాప్ సింగర్ తర్సామీ సింగ్ సైనీ అలియాస్ తాజ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 54 సంవత్సరాలు. గత కొంతకాలంగా హెర్నియా వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా శస్త్రచికిత్స ఆలస్యం కావడంతో ఈ సంవత్సరం ఆరంభంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కోమాలోకి వెళ్లాడు.
అయితే.. మార్చిలో ఆయన కోమాలోంచి బయటకు వచ్చాడని, ప్రస్తుతం కోలుకుంటున్నట్లు వైద్యబృందం తెలియజేసింది.కాగా.. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం(ఏప్రిల్ 29)న యూకేలో తుదిశ్వాస విడిచారు. అయితే ఏ కారణం చేత ఆయన మృతి చెందారనేది మాత్రం ఇంకా స్పష్టం కాలేదు.
90 వ దశకంలో వచ్చిన 'ప్యార్ హో గయా', 'నాచేంగే సారి రాత్', 'గల్లాన్ గోరియన్' వంటి పాటలకు మంచి ఆదరణ లభించాయి. ఈ పాటలు తాజ్ గ్రూప్ స్టీరియో నేషన్ ద్వారా విడుదలయ్యాయి. ఈ తాజ్ గ్రూప్ 1996లో ఏర్పడింది. 1989లో 'హిట్ ది డెక్ ఆల్బమ్'తో తాజ్ స్టీరియో నేషన్ ప్రజాదరణ పొందింది. లండన్‌లోని ఇతర భారతీయ కళాకారులతోపాటు తాజ్.. ఆసియా ఫ్యూజన్ సంగీతానికి మార్గదర్శకుల్లో ఒకరిగా పేరు సంపాదించారు. 'తుమ్ బిన్', 'కోయి మిల్ గయా', 'రేస్' వంటి బాలీవుడ్ చిత్రాలతో పాటు ఇటీవల విడుదలైన 'బట్లా హౌజ్' చిత్రంలోనూ తాజ్ పాటలు పాడారు.