భారతదేశంలో కరోనా మహమ్మారి ఉగ్ర రూపం దాలుస్తున్న సంగతి తెలిసిందే. పలువురు ప్రముఖులు కూడా కరోనా బారిన పడ్డారు. తాజాగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో ఆయన అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బందికిలో కొందరికి కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వడంతో పవన్ కళ్యాణ్ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. వ్యక్తిగత సిబ్బందిలో కొందరికి కరోనా నిర్ధారణ కావడంతో వైద్యుల సూచన మేరకు పవన్ హోం ఐసోలేషన్‌లోకి వెళ్లినట్టు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.
''జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ముఖ్య కార్యనిర్వాహకులు, భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందిలోని ఎక్కువ మంది కరోనా బారినపడ్డారు. ముందు జాగ్రత్త చర్యగా వైద్యుల సూచనతో ఆయన హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. గతవారం రోజులుగా ఆయన పరివారంలోని ఒక్కొక్కరూ కరోనా బారినపడుతూ వస్తున్నారు. వీరంతా ఆయనకు చాలా సమీపంగా విధులు నిర్వహిస్తారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా, కరోనా విస్తృతి నివారణలో భాగంగా ఆయన హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. రోజువారీ విధులు నిర్వహిస్తూనే పార్టీ కార్యక్రమాలను పరిశీలిస్తున్నారు. టెలీకాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారు" అని ఆ ప్రకటనలో తెలిపారు.
పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లోని తన నివాసంలో హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. ప్రస్తుతం వర్చువల్ పద్ధతిలోనే జనసేన పార్టీ కార్యకలాపాలను పవన్ పర్యవేక్షిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నిక స్థానంలో బీజేపీ-జనసేన తరఫున అభ్యర్థిగా రత్నప్రభ పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సిబ్బందిలో కొందరు కరోనా బారిన పడడంతో పవన్ తిరుపతి పర్యటనలపై సందిగ్ధత నెలకొంది.