'ధర్మం కోసం యుద్ధం'.. హరిహర వీరమల్లు టీజర్ అదిరిపోయిందిగా..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ కొత్త చిత్రం 'హరిహర వీరమల్లు'.

By Srikanth Gundamalla  Published on  2 May 2024 10:48 AM IST
pawan kalyan, hari hara veeramallu, movie, teaser, tollywood ,

'ధర్మం కోసం యుద్ధం'.. హరిహర వీరమల్లు టీజర్ అదిరిపోయిందిగా..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ మరో కొత్త చిత్రం 'హరిహర వీరమల్లు'. క్రియేటివ్‌ డైరెక్టర్ క్రిష్‌ దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పవన్ కల్యాణ్‌ లుక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. దాంతో.. ఈ బిగ్గెస్ట్‌ పీరియాడికల్‌ యాక్షన్ మూవీ నుంచి ఏదైనా అప్‌డేట్‌ వస్తే వెంటనే వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్‌. దీన్ని చూసిన నెటిజన్లు.. పవన్ అభిమానులు సూపర్బ్‌ అంటూ మెచ్చుకుంటున్నారు.

హరిహర వీరమల్లు సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్‌ పతాకంపై ఏఎం రత్నం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. కొద్దికాలం నుంచి ఈ సినిమా నుంచి పెద్దగా అప్‌డేట్స్‌ ఏమీ లేవు. దాంతో.. సినిమా వస్తుందా లేదా అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి. సోషల్ మీడియాలో అయితే హరిహర వీరమల్లు సినిమా ఆగిపోయిందనే వార్తలు కూడా వినిపించాయి. ఈ క్రమంలోనే పవన్‌ కల్యాణ్‌ ఫాన్స్‌కు ఊపు తెచ్చేలా చిత్ర యూనిట్‌ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ధర్మం కోసం యుద్ధం అంటూ హరిహర వీరమల్లు నుంచి టీజర్‌ను విడుదల చేశారు. పేదవారిని బానిసలుగా చూస్తూ వారిని చిత్ర హింసలు పెట్టే రాజుకు ఎదురునిలిచే పవర్‌ఫుల్ పాత్రలో పవన్ కనిపించాడు. ఇక టీజర్‌లో పవన్ కల్యాణ్‌ ను ఉద్దేశిస్తూ వాడొచ్చి దొంగ దొరల లెక్కలు సరిచేస్తాడు... అంటూ వచ్చే డైలాగ్‌ టీజర్‌కు హైలెట్‌గా నిలచింది. ఎంఎం కీరవాణి అందించిన సంగీతం మరో లెవెల్‌లో ఉంది. పవన్ కల్యాణ్‌ యాక్షన్‌ సీన్స్‌లో కనిపించడంతో అభిమానులు తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. సినిమా కూడా నెక్ట్స్‌ లెవెల్లో ఉండబోతుందని దీమా చెబుతున్నారు.

హరిహర వీరమల్లు సినిమాను రెండు పార్ట్‌లుగా తెరకెక్కిస్తున్నారు మూవీ మేకర్స్. మొదటి పార్ట్‌కు స్వర్డ్స్‌ వర్సెస్‌ స్పిరిట్‌ అనే టైటిల్‌ను ఉంచారు. ఇక ఈ సినిమా ఈ సంవత్సరమే థియేటర్లలో వస్తుందని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. ఏపీలో ఎన్నికలు పూర్తయిన వెంటనే పవన్ కల్యాణ్‌ రెగ్యులర్‌గా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొని ఫినిష్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Next Story