ప‌వ‌న్, అలీ మ‌ళ్లీ క‌లిసారు.. వీడియో వైర‌ల్‌.. విభేదాలు స‌మ‌సిన‌ట్లేనా..!

Pawan Kalyan and Ali Together After Long Time.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సీనియర్ కమెడియన్ ఆలీ మ‌ళ్లీ క‌లిసారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Feb 2021 4:39 AM GMT
Pawan Kalyan and Ali Together After Long Time

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సీనియర్ కమెడియన్ ఆలీ మంచి స్నేహితులనే సంగతి అందరికీ తెలిసిందే. ప‌వ‌న్ హీరోగా న‌టించిన దాదాపు ప్ర‌తి సినిమాలోనూ అలీ న‌టించేవారు. 'గోకులంలో సీత' తో మొద‌లైన వీరి సినీ ప్ర‌యాణం 'కాట‌మ‌రాయుడు' వ‌ర‌కు కొన‌సాగింది. ముఖ్యంగా వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'ఖుషీ' సినిమాను పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పటికీ మరిచిపోలేరు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా 25 సినిమాలు చేస్తే.. 23 సినిమాల్లో అలీ న‌టించాడు. వీరిద్ద‌రి మ‌ధ్య మంచి అనుబంధ‌మే దీనికి కార‌ణం అనేది కాద‌న‌లేద‌ని వాస్త‌వం. అయితే, గత ఎన్నికల సమయంలో వీరిద్దరి మధ్య స్వల్ప విభేదాలు వచ్చాయి.

గత ఎన్నికల సమయంలో అలీ తనకు అత్యంత సన్నిహితుడైన పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనలో కాకుండా జగన్మోహన్ రెడ్డికి చెందిన వైసీపీలో చేరడం హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ పార్టీలో చేరడంతో పాటు పవన్ కళ్యాణ్ తనను పార్టీలోకి పిలవలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడంతో పవన్‌కు అలీల మధ్య గ్యాప్ వచ్చింది. ఇక అలీ దానికి వివరణ ఇవ్వడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఆతర్వాత కూడా అలీ వైసీపీ కే మద్దతుగా చాలా సందర్భాల్లో మాట్లాడారు. అప్పటి వరకు పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాలో ఉండే అలీ ని దూరం పెట్టారంటూ పుకార్లు షికారు అయ్యాయి. అయితే అలీ వైసీపీ పార్టీలో ఉన్నప్పటికీ పార్టీ వ్యవహారాలకు దూరంగానే ఉంటూ టీవీ షోలతో తనపని తాను చేసుకుంటున్నారు.

ఈ నేప‌థ్యంలో వీరిద్ద‌రి మ‌ధ్య ఉన్న విభేదాలు స‌మ‌సి పోయిన‌ట్లు తెలుస్తోంది. అలీ భార్య జుబేదా తమ కుటుంబంలోని బెస్ట్ మూమెంట్స్ అంటూఓ వీడియో షేర్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫిబ్రవరి 18 న అలీ ఇంట్లో వివాహ వేడుక జరిగింది. ఈ పెళ్ళికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అలీ పవన్ కళ్యాణ్ కలిసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వీడియో చూసిన సినీ ప్రేమికులు.. బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరూ మళ్ళీ ఒకటయ్యారు అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Next Story