ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లు అభినందనలు తెలిపారు. నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) వారసత్వాన్ని కొనసాగిస్తూ సినీ, రాజకీయ రంగాల్లో బాలకృష్ణ రాణిస్తున్నారని చంద్రబాబు నాయుడు కొనియాడారు. లెక్కలేనన్ని ప్రాణాలను కాపాడిన బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ప్రజాసేవకు బాలకృష్ణ విశేష కృషి చేశారని కొనియాడారు. ఎంతో మంది జీవితాల్లో స్ఫూర్తిని నింపిన నిజమైన దిగ్గజ నాయకుడికి ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు లభించిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ దక్కడం పట్ల మంత్రి నారా లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది తమ కుటుంబానికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. లోకేశ్ ఇలా అన్నారు.. ''ఈ అవార్డు సినిమా, రాజకీయాలు, ఆరోగ్య సంరక్షణలో బ్లాక్‌బస్టర్ హిట్‌ల నుండి మిలియన్ల మంది ప్రజలను ప్రేరేపించడం వరకు మీరు చేసిన సేవలకు నిదర్శనం. మీ విజయాలు గుర్తించబడటం చూసి మేము సంతోషిస్తున్నాము'' అని అన్నారు.
పద్మభూషణ్ పురస్కారం పొందిన బాలకృష్ణకు సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ శుభాకాంక్షలు తెలిపారు. సినీ రంగానికి బాలయ్య బాబాయి చేసిన సేవ అసమానమైనదని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. మీ నిర్విరామ కృషి, ప్రజాసేవకు ఈ అవార్డు నిదర్శనమని జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ ద్వారా తెలిపారు. బాలయ్యకు పుద్మ పురస్కారం లభించడంతో నందమూరి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.