'నాటు నాటు'కు ఆస్కార్.. 'ఆర్‌ఆర్‌ఆర్' టీమ్‌కు ప్రముఖుల అభినందన
భారతీయ సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌లోని 'నాటు నాటు' పాట బెస్ట్ ఒరిజనల్ సాంగ్ కేటగిరీలో అవార్డును సొంతం చేసుకుంది.
By అంజి Published on 13 March 2023 10:45 AM IST'నాటు నాటు'కు ఆస్కార్.. 'ఆర్‌ఆర్‌ఆర్' టీమ్‌కు ప్రముఖుల అభినందన
ఆస్కార్ 2023 వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో భారతీయ సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌లోని 'నాటు నాటు' పాట బెస్ట్ ఒరిజనల్ సాంగ్ కేటగిరీలో అవార్డును సొంతం చేసుకుంది. భారతీయ సినీ ప్రేమికుల ఎన్నో ఏళ్ల కళను ఆర్‌ఆర్‌ఆర్ సినిమా సాకారం చేసింది. 'నాటు నాటు' సాంగ్‌కు ఆస్కార్ రావడంపై భారత సినీ పరిశ్రమ ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా ఆస్కార్ అవార్డు గెల్చుకోవడంపై భారత్‌కు చెందిన ప్రముఖులు అభినందలు తెలుపుతూ తమ సందేశాలను ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌కు సోషల్ మీడియా వేదికగా పంపుతున్నారు.
ఆర్‌ఆర్‌ఆర్‌లోని 'నాటు నాటు' సాంగ్‌కు ఆస్కార్ అవార్డు రావడం పట్ల చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. రామ్‌చరణ్ కూడా ఇందులో భాగస్వామ్యం కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను ఆస్కార్‌కు తీసుకెళ్లేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ప్రశంసలు దక్కాలన్నారు. ఎస్ ఎస్ రాజమౌళి, కీరవాణి, ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఎంతో కష్టపడ్డారని చిరు అన్నారు.
'నాటు నాటు' సాంగ్‌కు ఆస్కార్ రావడం పట్ల సినీ నటుడు నాగార్జున స్పందించారు. భారతీయ సినిమాకు ఇదొక చారిత్రాక ఘట్టం అని అన్నారు. సినీ అభిమానులనే కాదు, ప్రతీ భారతీయుడిని గర్వపడేలా చేశారని ప్రశంసించారు. బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ సాధించిన ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌కు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభినందనలు తెలిపారు. భారతీయులను, తెలుగు సినిమాను ఆర్‌ఆర్‌ఆర్ టీం గర్వించేలా చేశారని అన్నారు.
భారతీయులందరూ గర్వపడేలా ఆస్కార్ వేదికపై అవార్డు అందుకున్న మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌లకు జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. ఆస్కార్ బెస్ట్ ఒరిజనల్ సాంగ్‌గా నిలిచిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని 'నాటు నాటు'.. పాటలోని తెలుగు పదం నేల నలుచెరగులా ప్రతి ఒక్కరితో పదం కలిపేలా చేసి హుషారెత్తించిందన్నారు. ఈ సాంగ్‌ను ఆస్కార్ వేదికపై ప్రదర్శించడంతో పాటు.. అవార్డు పొందటం ద్వారా భారతీయ సినిమా మరోస్థాయికి చేరిందన్నారు.
''ఆస్కార్స్‌లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా అకాడమీ అవార్డును గెలుచుకోవడం ద్వారా ‘నాటు నాటు’ చరిత్రలో తన స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇది బహుశా భారతీయ సినిమాకు అత్యుత్తమ క్షణం మరియు తెలుగువారు దీనిని సాధించడం మరింత ప్రత్యేకమైనది'' అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు.
బెస్ట్ ఒరిజనల్ సాంగ్ కెటగిరీలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని 'నాటు నాటు' సాంగ్ ఆస్కార్ అందుకోవడం అభినందనీయమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. చిత్రబృందానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.