Oscars 2023: 'ఆర్‌ఆర్‌ఆర్‌' సరికొత్త చరిత్ర.. 'నాటు నాటు'కు ఆస్కార్‌

బెస్ట్‌ ఒరిజనల్‌ సాంగ్‌ విభాగంలో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని 'నాటు నాటు' పాట బెస్ట్‌ సాంగ్‌గా ఆస్కార్‌ అవార్డును అందుకుంది.

By అంజి  Published on  13 March 2023 9:14 AM IST
Naatu Naatu , Oscar 2023, RRR song

'ఆర్‌ఆర్‌ఆర్‌' సరికొత్త చరిత్ర.. 'నాటు నాటు'కు ఆస్కార్‌

లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 95వ అకాడమీ అవార్డుల వేడుక కొనసాగుతోంది. తాజాగా బెస్ట్‌ ఒరిజనల్‌ సాంగ్‌ విభాగంలో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని 'నాటు నాటు' పాట బెస్ట్‌ సాంగ్‌గా ఆస్కార్‌ అవార్డును అందుకుంది. ఆస్కార్‌ స్టేజీపై ఆర్‌ఆర్‌ఆర్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం. కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌లు అవార్డును అందుకున్నారు. ఒరిజనల్‌ సాంగ్‌ కెటగిరీలో 'నాటు నాటు' సాంగ్‌ను ప్రకటించగానే డాల్బీ థియేటర్‌ చప్పట్లతో మార్మోగిపోయింది. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రయూనిట్‌ ఆనందోత్సవంలో ముగినిపోయింది.

అవార్డు అందుకున్న అనంతరం మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీరవాణి.. ఆస్కార్‌ అకాడమీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్‌ఆర్‌ఆర్‌ దేశాన్ని గర్వపడేలా చేసిందని, తనని ప్రపంచ శిఖరాగ్రాన నిలబెట్టిందని అన్నారు. గీతా రచయిత చంద్రబోస్‌ కూడా.. అందరికీ నమస్తే అంటూ ధన్యవాదాలు తెలిపారు. ఆస్కార్‌ అవార్డు గెలిచిన మొదటి భారతీయ చిత్రంగా ఆర్‌ఆర్‌ఆర్‌, మొదటి భారతీయ సాంగ్‌గా 'నాటు నాటు' సరికొత్త చరిత్ర సృష్టించాయి. బెస్ట్‌ ఒరిజనల్‌ సాంగ్‌ విభాగంలో 'అప్లాజ్‌' (టెల్‌ ఇట్‌ లైక్‌ ఏ ఉమన్‌), 'లిప్ట్‌ మి అప్‌' (బ్లాక్‌ పాంథర్‌: వకాండా ఫెరవర్‌), 'దిస్‌ ఈజ్‌ ఎ లైఫ్‌' (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌), 'హాల్డ్‌ మై హ్యాండ్‌' (టాప్‌గన్‌ మావెరిక్‌) పాటలు.. 'నాటు నాటు' పాటతో పోటీపడ్డాయి.

అయితే ఆ పాటలన్నింటీని వెనక్కి నెట్టి 'నాటు నాటు' పాట ఆస్కార్‌ అవార్డును సొంతం చేసుకుంది. దీంతో భారత సినిమాకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా సాకారం చేసి చూపించింది. మరోవైపు ఆస్కార్‌ వేడుకల్లో తెలుగు పాట 'నాటు నాటు' అదరగొట్టింది. సింగర్స్‌ కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ లైవ్‌లో పాట పాడగా.. హాలీవుడ్‌ తారలు తమ డ్యాన్స్‌తో అదరగొట్టారు. అంతకుముందు 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలోని 'నాటు నాటు' పాటను దీపికా పదుకునే ఆస్కార్‌ వేడుకలో పరిచయం చేశారు. 'నాటు నాటు' పాట నేపథ్యాన్ని వేడుకకు హాజరైన వారికి వివరించారు.

Next Story