బాలీవుడ్ స్టార్‌ హీరో షూటింగ్‌ సెట్‌లో అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి

One Dead In Fire Incident On Sets Of Ranbir-Shraddha's Upcoming Luv Ranjan Film. ల‌వ్ రంజ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో బాలీవుడ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 July 2022 11:41 AM IST
బాలీవుడ్ స్టార్‌ హీరో షూటింగ్‌ సెట్‌లో అగ్ని ప్రమాదం..  ఒకరు మృతి

ల‌వ్ రంజ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్ ఓ చిత్రంలో న‌టిస్తున్నారు. శ్ర‌ద్ధాక‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్ర షూటింగ్ సెట్‌లో అగ్నిప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో ఒక‌రు మృతి చెందారు.

వివ‌రాల్లోకి వెళితే.. రణ్‌బీర్ కపూర్, శ్ర‌ద్దా క‌పూర్ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలోని స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించేందుకు ముంబై సబర్బన్ అంధేరిలోని చిత్ర కూట్ గ్రౌండ్‌లో ఓ సెట్ వేశారు. శుక్ర‌వారం సాయంత్రం 4.30 గంట‌ల స‌మ‌యంలో సెట్‌లో అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున మంట‌లు ఎగిసిప‌డ్డాయి. దీంతో ఆ ప్రాంతం చుట్టు ప్ర‌క్క‌ల దట్టమైన పొగ వ్యాపించింది.

మంటలను అదుపు చేసేందుకు ఐదు ఫైర్ ఇంజన్లు ,ఐదు వాటర్ జెట్టీలు రంగంలోకి దించారు. రాత్రి తొమ్మిద‌న్న‌ర గంట‌ల‌కు మంట‌లు అదుపులోకి వ‌చ్చిన‌ట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో షూటింగ్‌ సిబ్బంది మనీశ్‌ దేవాశీ(32) మరణించగా మరికొందరు గాయపడినట్లు సమాచారం. కాగా.. ప్ర‌మాద‌స‌మ‌యంలో రణ్‌బీర్, శ్రద్ధా కపూర్ సెట్‌లో లేక‌పోవ‌డంతో పెద్ద ప్ర‌మాదం త‌ప్పింద‌ని అంటున్నారు. బోనీ క‌పూర్‌, డింపుల్ క‌పాడియాలు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రం మార్చి 8, 2023న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

చెక్క వస్తువులను నిల్వ ఉంచిన తాత్కాలిక స్టోర్‌ రూమ్‌లో తొలుత మంట‌లు చెల‌రేగిన‌ట్లు తెలుస్తోంది. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story