విషాదం.. హైద‌రాబాద్‌లో చికిత్స పొందుతూ ప్ర‌ముఖ ఒడియా న‌టుడు క‌న్నుమూత‌

గ‌త కొంత‌కాలంగా కాలేయ సంబంధిత సమస్యలతో బాధ‌ప‌డుతున్న ప్ర‌ముఖ ఒడియా న‌టుడు పింటు నందా క‌న్నుమూశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 March 2023 10:04 AM IST
Pintu Nanda,Pintu Nanda passes away

Pintu Nanda

సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ ఒడియా న‌టుడు పింటు నందా క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న హైద‌రాబాద్‌లో చికిత్స పొందుతున్నాడు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో బుధ‌వారం రాత్రి ఆయ‌న తుదిశ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌స్సు 45 సంవ‌త్స‌రాలు.

కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయ‌న తొలుత‌ భువనేశ్వర్‏లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందారు. అయితే ప‌రిస్థితిలో మార్పు రాక‌పోవ‌డంతో కాలేయ మార్పిడి చేయాల‌ని నిర్ణ‌యించారు. ఇందుకోసం న్యూఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ (ILBS)కి తరలించారు. అయితే.. అక్క‌డ దాత‌లు ఎవ‌రూ దొర‌క‌క‌పోవ‌డంతో కాలేయ మార్పిడి సాధ్యం కాలేదు.

ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి క్షీణిస్తుండ‌డంతో హైద‌రాబాద్‌లోని య‌శోద ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. అయితే.. బుధ‌వారం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించ‌డంతో తుదిశ్వాస విడిచాడు. ఆయ‌న మ‌ర‌ణంతో ఒడియా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విషాదం నెల‌కొంది. నంద మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు.

1996లో 'కోయిలి' చిత్రంతో తెర‌గ్రేటం చేశారు నంద‌. హీరోగా, విల‌న్‌గా, సహయ నటుడిగా, హాస్యనటుడిగా న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 'దోస్తీ', 'హట ధారి చాలు తా', 'రుంకు ఝుమానా' , 'రాంగ్ నంబర్', 'ప్రేమ రుతు అసిగల' వంటి చిత్రాల్లో న‌టించారు.

Next Story