సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ గాయకుడు, జాతీయ అవార్డు గ్రహీత శివమొగ సుబ్బన్న కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని జయదేవ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. గురువారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. సుబన్న కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఆయన అభిమానుల సందర్శనార్థం బెంగళూరులోని రవీంద్ర కళాక్షేత్రంలో పార్థీవదేహాన్ని ఉంచనున్నారు.
సుబ్బన్న అసలు పేరు జి.సుబ్రమణ్యం. 1938లో శివమొగ్గ జిల్లాలోని నగర్ గ్రామంలో జన్మించారు. శాస్త్రీయ సంగీతంలో పట్టు సాధించారు. బీఏ ఎల్ఎల్‌బీ చేసిన ఆయన కొంత కాలం న్యాయవాదిగా కూడా పని చేశారు. అనంతరం గాయకుడిగా మారాడు. తన కంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.' కాడు కుదురె' చిత్రంలోనే 'కాడు కుదురె ఒడి బండిట్టా' అనే పాటకు 1979లో అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి చేతుల మీదుగా రజత కమలం అవార్డును అందుకున్నారు. శాండల్‌వుడ్‌లో జాతీయ అవార్డు అందుకున్న తొలి గాయకుడిగా సుబ్బన్న గుర్తింపు పొందారు.