సినిమా థియేటర్ల మూసివేత ప్రచారంపై ఫిల్మ్ ఛాంబర్ కీలక ప్రకటన
తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1వ తేదీ నుంచి సినిమా థియేటర్లు మూతపడతాయంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ స్పష్టం చేసింది.
By Knakam Karthik
సినిమా థియేటర్ల మూసివేత ప్రచారంపై ఫిల్మ్ ఛాంబర్ కీలక ప్రకటన
తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1వ తేదీ నుంచి సినిమా థియేటర్లు మూతపడతాయంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ స్పష్టం చేసింది. థియేటర్లకు కూడా పర్సంటేజీ విధానం అమలు చేయాలన్న డిమాండ్ నేపథ్యంలో చర్చలు విఫలమైతే బంద్‌కు వెళ్లే ఆలోచన ఉందన్న మాట వాస్తవమే అయినా, ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని తేల్చిచెప్పింది. శనివారం ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో జరిగిన సమావేశం అనంతరం ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ మీడియాకు వివరాలు వెల్లడించారు.
దామోదర ప్రసాద్ మాట్లాడుతూ, "థియేటర్ల బంద్ ఉంటుందని కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారు. చర్చలు సఫలం కాకపోతే జూన్ 1 నుంచి అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందేమోనని మాత్రమే అంతర్గతంగా అనుకున్నాం. కానీ, అందరూ థియేటర్లు మూసేస్తున్నారనే ప్రచారం చేశారు. ప్రస్తుతం అలాంటిదేమీ లేదు. దయచేసి ఈ వదంతులను ఎవరూ నమ్మవద్దు" అని విజ్ఞప్తి చేశారు. కేవలం ఒక సినిమాను దృష్టిలో పెట్టుకుని థియేటర్లను బంద్ చేస్తున్నామనడం సరికాదని, కొన్ని వార్తలు పరిశ్రమ వ్యాపారాన్ని దెబ్బతీస్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
చిత్ర పరిశ్రమలో వందలాది సమస్యలు ఉన్నాయని, అవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని దామోదర ప్రసాద్ తెలిపారు. "వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ రావాలి. థియేటర్ల పర్సంటేజీ విధానంపై చాలా ఏళ్లుగా చర్చ జరగలేదు. ఇప్పుడు ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయి. తదుపరి కార్యాచరణ ప్రణాళికను త్వరలో నిర్ణయిస్తాం. ఇందుకోసం మూడు విభాగాల నుంచి ప్రతినిధులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. నిర్దిష్ట సమయంలోగా సమస్యలను పరిష్కరించుకోవాలని భావిస్తున్నాం. ఈ నెల 30న జరిగే సమావేశంలో కమిటీలో ఎవరుంటారనేది నిర్ణయిస్తాం" అని ఆయన వివరించారు.