ఏఐ మార్ఫింగ్ ఫొటోలపై నివేదా థామన్ వార్నింగ్

తన ఫొటోలను కొందరు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అస‌భ్య‌క‌రంగా ప్రచారం చేయడంపై ప్రముఖ నటి నివేదా థామస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

By -  Knakam Karthik
Published on : 18 Dec 2025 12:04 PM IST

Cinema News, Tollywood, Entertainment, Nivetha Thaman, AI morphing photos, Social Media, AI deepfake, Cybercrime

ఏఐ మార్ఫింగ్ ఫొటోలపై నివేదా థామన్ వార్నింగ్

తన ఫొటోలను కొందరు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అస‌భ్య‌క‌రంగా ప్రచారం చేయడంపై ప్రముఖ నటి నివేదా థామస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చట్టవిరుద్ధమని, తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని పేర్కొంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు.

ఇటీవల నివేదా థామస్ క్రీమ్ కలర్ చీరలో ఉన్న ఒక అందమైన ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటో వైరల్ అవ్వగా, కొందరు ఆకతాయిలు దానిని ఏఐ సాయంతో అసభ్యకరంగా మార్చి ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ చేయడం ప్రారంభించారు. ఈ విషయం ఆమె దృష్టికి రావడంతో తీవ్రంగా స్పందించారు.

ఈ సందర్భంగా నివేదా తన ప్రకటనలో, "నా అనుమతి లేకుండా నా ఫొటోను ఏఐ సాయంతో మార్చి సర్క్యులేట్ చేస్తున్న విషయం నా దృష్టికి వచ్చింది. ఇది చాలా బాధాకరం. ఆమోదయోగ్యం కాదు, చట్టవిరుద్ధం కూడా. ఇది నా వ్యక్తిగత గోప్యతకు తీవ్ర భంగం కలిగించడమే" అని పేర్కొన్నారు.

"ఈ విషయాన్ని నేను తీవ్రంగా పరిగణిస్తున్నాను. అజ్ఞాత ఖాతాల ద్వారా ఇలాంటివి చేస్తున్న వారు వెంటనే ఆ కంటెంట్‌ను తొలగించాలి. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవు. ఇటువంటి వాటిని ఎవరూ షేర్ చేయవద్దు, ప్రోత్సహించవద్దు" అని ఆమె విజ్ఞప్తి చేశారు.

Next Story