ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తన సోదరుడు షమాసుద్దీన్, మాజీ భార్య అంజనా పాండేలపై పరువు నష్టం దావా వేశారు. ఇటీవలి కాలంలో నవాజుద్దీన్ సిద్ధిఖీపై వారు సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అయితే తానెలాంటి తప్పు చేయలేదని, తన పరువుకు భంగం కలిగించేలా చాలా ఆరోపణలను వారు చేస్తూ ఉన్నారని నవాజుద్దీన్ కోర్టుకు ఎక్కారు. వారి వ్యాఖ్యల కారణంగా తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, పరువు నష్టం పరిహారంగా రూ.100 కోట్లు ఇవ్వాలని దావా వేశారు. న్యాయవాది సునీల్ కుమార్ ద్వారా ఈ దావా దాఖలు చేశారు. మార్చి 30 న విచారణకు రానుంది.
తన పరువు తీయకుండా ఇద్దరినీ శాశ్వతంగా నిరోధించేలా ఇంజక్షన్ విధించాలని దావా కోర్టును కోరింది. తన సోదరుడు, మాజీ భార్య వారి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తన గురించి ఎటువంటి పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను ప్రచురించకుండా చేయాలని, ఇప్పటికే తనపై చేసిన పరువు నష్టం కలిగించే ఆరోపణలను ఉపసంహరించుకోవాలని సిద్ధిఖీ దావాలో కోరారు. సిద్ధిఖీ తన పరువు తీసినందుకు వ్రాతపూర్వకంగా బహిరంగ క్షమాపణ కూడా కోరారు.
తన మాజీ భార్య ఆలియా తన పిల్లలని దాచిపెట్టిందని గతంలో బాంబే హైకోర్టుకు తెలిపాడు. భార్య ఆలియాపై హేబియస్ కార్పస్ పిటిషన్‌ను కూడా దాఖలు చేశాడు. తన ఇద్దరు పిల్లలు దుబాయ్‌లోని పాఠశాల నుంచి కనిపించకుండా పోయారని నవాజుద్దీన్ తెలిపారు. వారి ఆచూకీ తెలుసుకోవడం చాలా కష్టంగా మారిందని నవాజ్ తరఫు న్యాయవాది ప్రదీప్ థోరత్ తెలిపారు. పిల్లలు కనపడడం లేదన్న ఒకే ఒక్క కారణంగా నవాజుద్దీన్ సిద్ధిఖీ హేబియస్ కార్పస్ పిటిషన్ వేశారని తెలిపారు.