కేంద్రం 67వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డులలో జాతీయ ఉత్తమ హిందీ చిత్రం అవార్డు చిచోరే సినిమాకు దక్కింది. ఈ సినిమాలో దివంగత బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటించగా.. తెలుగు హీరో నవీన్ పొలిశెట్టి.. యాసిడ్ అనే ముఖ్యమైన పాత్రలో నటించాడు.
కేంద్రం అవార్డులను ప్రకటించిన నేఫథ్యంలో నవీన్.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ను తలుచుకుని సోషల్ మీడియాలో ఎమోషనల్ అయ్యాడు. మన సినిమా చిచోరే కు జాతీయ అవార్డు వచ్చింది. మరోవైపు జాతిరత్నాలు మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. సుశాంత్.. ఇదంతా నువ్వు చూస్తున్నావని నాకు తెలుసు. ఈ అవార్డు నీకే సొంతం. చిత్ర యూనిట్‌కు నా శుభాకాంక్షలు. లవ్ యూ యాసిడ్.. అంటూ ట్వీట్ చేశాడు.
ఇదిలావుంటే.. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం 'జాతిరత్నాలు'. 'మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా మారి స్వప్న సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. అనుదీప్ కేవీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మహాశివరాత్రి కానుకగా మార్చి 11న విడుదలై విజయఢంకా మోగిస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ బ్లాక్ బస్టర్ హిట్‌గా దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ చిత్రం రూ. 50 కోట్ల గ్రాస్ సాధించినట్లుగా చిత్రవర్గాలు తెలుపుతున్నాయి.