నారప్ప వాయిదా.. తప్పలేదన్న టీమ్

Narappa movie release postponed.కరోనా మహమ్మారి కారణంగా సినిమాల విడుదల కష్టంగా మారిపోయింది. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన నారప్ప సినిమా కూడా వాయిదా పడిపోయింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 April 2021 4:36 PM IST
Narappa

కరోనా మహమ్మారి కారణంగా సినిమాల విడుదల కష్టంగా మారిపోయింది. కొన్ని సినిమాలు ఓటీటీ బాట పడుతూ ఉండగా.. ఇంకొన్ని సినిమాలు వాయిదా వేసుకోకతప్పడం లేదు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలకు చెందిన సినిమాలు వాయిదా పడగా.. తాజాగా విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన నారప్ప సినిమా కూడా వాయిదా పడిపోయింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కరోనా మహమ్మారితో పోరాడుతున్న సమయంలో చిత్రాన్ని విడుదల చేయడం కూడా అంత మంచిది కాదని చిత్ర యూనిట్ తెలిపింది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సినిమాను వాయిదా వేస్తున్నామని.. పరిస్థితులు చక్కబడ్డాక అతిత్వరలో చిత్రాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. నారప్ప సినిమా రిలీజ్ వాయిదా పడిందని వెంకటేష్ కూడా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అందరం మాస్కులు ధరించి, బౌతిక దూరాన్ని పాటిస్తూ ఎవరికీ వారు జాగ్రత్తగా ఉండటమే మనం సమాజానికి చేసే గొప్ప సాయం అంటూ చెప్పుకొచ్చారు.

ధనుష్ నటించిన అసురన్ సినిమాను రీమేక్‌గా తెలుగులో నారప్ప తెర‌కెక్కించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తుండగా, ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. సురేష్‌బాబు, కలైపులి ఎస్‌.థాను నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. చిరంజీవి ఆచార్య, నాగ చైతన్య లవ్ స్టోరీ, గోపీచంద్ సీటీమార్, టక్ జగదీశ్ సినిమాలు విడుదల తేదీలను వాయిదా వేసుకున్నాయి. తాజాగా 'నారప్ప' సినిమా విడుదల కూడా వాయిదా పడింది.


Next Story