హైదరాబాద్‌ చేరుకున్న తారకరత్న భౌతికకాయం.. సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల సంతాపం

Nandamuri Tarakaratna Body Reached Hyderabad.నందమూరి తారకరత్న పార్థివ దేహాన్ని హైదరాబాద్‌ తీసుకొచ్చారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Feb 2023 9:05 AM IST
హైదరాబాద్‌ చేరుకున్న తారకరత్న భౌతికకాయం.. సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల సంతాపం

నంద‌మూరి తార‌క‌ర‌త్న బెంగ‌ళూరులోని నారాయ‌ణ హృద‌యాల‌య ఆస్ప‌త్రిలో 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి శ‌నివారం క‌న్నుమూశారు. ఆయ‌న భౌతిక కాయాన్ని హైద‌రాబాద్‌కు తీసుకువ‌చ్చారు. రంగారెడ్డి జిల్లా మోకిల‌లోని ఆయ‌న నివాసానికి పార్థివ‌దేహాన్ని త‌ర‌లించారు. తార‌క‌ర‌త్న‌ను చివ‌రి సారి చూసేందుకు కుటుంబ స‌భ్యులు, ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఆయ‌న నివాసానికి త‌ర‌లివ‌స్తున్నారు.

అభిమానుల సంద‌ర్శ‌నార్థం రేపు(సోమ‌వారం) ఉద‌యం 7 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు ఫిలిం ఛాంబ‌ర్‌లో తార‌క‌ర‌త్న పార్థివ‌దేహాన్ని ఉంచుతారు. సాయంత్రం 5 గంట‌ల‌కు మ‌హాప్ర‌స్థానంలో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తారు. ఆయ‌న మృతి అటు సినీ ప‌రిశ్ర‌మ‌, ఇటు నంద‌మూరి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయ‌న మృతి ప‌ట్ల ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా సంతాపాన్ని తెలియ‌జేస్తున్నారు.

తార‌క‌ర‌త్న మృతి ప‌ట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. ఆయ‌న మ‌ర‌ణం క‌ల‌చివేసింద‌న్నారు. ప్ర‌కాశ‌వంత‌మైన, ప్ర‌తిభావంతుడైన, ఆప్యాయ‌త గ‌ల యువ‌కుడు చిన్న వ‌య‌సులోనే మ‌ర‌ణించాడ‌ని విచారం వ్య‌క్తం చేశారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకున్నారు.

న‌టుడు శ్రీ నంద‌మూరి తార‌క‌ర‌త్న క‌న్నుమూయడం బాధాక‌రం. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప‌ర‌మేశ్వ‌రుణ్ణి ప్రార్థిస్తున్నాను. గ‌త మూడు వారాలుగా బెంగ‌ళూరు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న తార‌క‌ర‌త్న కోలుకుంటార‌ని బావించాను. ఆయ‌న న‌టుడిగా రాణిస్తూనే ప్ర‌జా జీవితంలో ఉండాల‌నుకొన్నారు. ఆ ఆశ‌లు నెర‌వేర‌కుండానే తుదిశ్వాస విడవ‌టం దుర‌దృష్ట‌క‌రం. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను. - ప‌వ‌న్ క‌ళ్యాణ్





Next Story