ఏపీలో సినిమా గోడును పట్టించుకునేవాళ్లేరీ..? : బాలకృష్ణ
Nandamuri Balakrishna speech in Akhanda success meet.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని థియేటర్లలో సినిమా టికెట్ల ధరలను
By తోట వంశీ కుమార్ Published on 12 Jan 2022 2:01 PM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని థియేటర్లలో సినిమా టికెట్ల ధరలను ప్రభుత్వం తగ్గించిన సంగతి తెలిసిందే. సినిమా టికెట్ల ధరలు తగ్గించడంపై వివాదం రాజుకోగా ఈ విషయంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఏపీ మంత్రి పేర్ని నాని చర్చలు జరిపినప్పటికీ అవి ఫలించలేదు. ఇదిలా ఉంటే నందమూరి బాలకృష్ణ ప్రభుత్వం తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని సినిమా టికెట్ల వ్యవహారంపై ఇండస్ట్రీ అంతా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. టికెట్ ధరలపై సినీ పరిశ్రమ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. అఖండ చిత్ర విజయోత్సవ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఏపీ ప్రభుత్వం చెబుతున్నట్లు పెద్ద సినిమా, చిన్న సినిమా అన్న తేడా ఉండదన్నారు. పెద్ద చిత్రం ప్లాప్ అయితే చిన్న సినిమా అని.. చిన్న సినిమా హిట్ అయితే.. పెద్ద సినిమా అంటారన్నారు. సినిమా గోడును ఏపీలో పట్టించుకునేవాళ్లు ఎవరున్నారు అని ప్రశ్నించారు. ఎవరో ఒకరు ముందుకు వచ్చి పరిశ్రమ సమస్యలను ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం ఉందని బాలయ్య అభిప్రాయపడ్డారు. సినీ ఇండస్ట్రీపై లక్షలాది మంది ఆధారపడి జీవిస్తున్నారని.. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లితేనే వారందరికి ఉపాధి లభిస్తుందన్నారు. టికెట్ల వ్యవహారం త్వరలోనే కొలిక్కి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక 'అఖండ' చిత్రం ఘన విజయం సాధించడం పట్ల బాలయ్య స్పందిస్తూ.. చిత్ర పరిశ్రమ ఉన్నంత వరకు 'అఖండ' చిత్రం ఉంటుందన్నారు. ఏపీ, తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాల్లోనూ ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారన్నారు. పాకిస్థాన్‌లో కూడా అఖండ చెలరేగిపోతుందన్నారు. అక్కడి నుంచి వాట్సాప్ వీడియోలు వస్తున్నాయని తెలిపారు. థియేటర్లకు జనం వస్తారా..? రారా.? అన్న భయాందోళనలో సినీ పరిశ్రమ ఉన్న సమయంలో చిత్ర పరిశ్రమకు ఈ చిత్రం ధైర్యాన్నిచ్చిందన్నారు. పెద్ద సినిమా, చిన్న సినిమా అన్న తేడా లేదని అన్ని చిత్రాలు ఆడాలని బాలయ్య ఆకాంక్షించారు. భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించే దర్శకుడు బోయపాటి శ్రీను అని బాలయ్య కొనియాడారు.