నాగ చైతన్యకు బాలీవుడ్ ఆఫర్.. ఆమిర్ ఖాన్ సినిమాలోనా..?
Naga Chaitanya to replace Vijay Sethupathi in 'Lal Singh Chaddha'. నాగ చైతన్య ఇప్పటి వరకూ టాలీవుడ్ వరకే పరిమితం కాగా.. ఇప్పుడు బడా బాలీవుడ్ ప్రాజెక్టులో భాగమవ్వబోతున్నట్లు కథనాలు వస్తున్నాయి.
By Medi Samrat Published on 17 March 2021 3:30 PM GMT
చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్.. ఈ నలుగురిలో బాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేసిన నటుడెవరంటే నాగార్జున అనే చెప్పొచ్చు. చిరంజీవి, వెంకటేష్ అప్పుడప్పుడు మాత్రమే బాలీవుడ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు కానీ.. నాగార్జున మాత్రం పలు డైరెక్ట్ సినిమాలు చేయడమే కాకుండా.. పలు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించాడు. ఇక ఆయన బాటలో ఆయన వారసుడు నాగ చైతన్య కూడా ప్రయాణిస్తూ ఉన్నాడని అంటున్నారు. నాగ చైతన్య ఇప్పటి వరకూ టాలీవుడ్ వరకే పరిమితం కాగా.. ఇప్పుడు బడా బాలీవుడ్ ప్రాజెక్టులో భాగమవ్వబోతున్నట్లు కథనాలు వస్తున్నాయి.
ఆమిర్ ఖాన్ హీరోగా 'లాల్ సింగ్ చద్దా' పేరుతో ప్రస్తుతం ఓ హిందీ సినిమా తెరకెక్కుతోంది. హాలీవుడ్ హిట్ సినిమా 'ఫారెస్ట్ గంప్'కి రీమేక్ గా దీనిని నిర్మిస్తున్నారు. ఇందులో ఓ కీలక పాత్రకు మొదట్లో తమిళ నటుడు విజయ్ సేతుపతిని అనుకున్నారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ పాత్ర కోసం నాగ చైతన్యని సంప్రదించారని, ఆయన కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. లాల్ సింగ్ చద్దా లో కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తూ ఉన్నాడు.