ప్రముఖ సినీ నటుడు జగపతి బాబు ఎక్స్ వేదికగా సంచలన ప్రకటన చేశారు. ఇకపై తన అభిమాన సంఘాలు, ట్రస్టుతో తనకు ఎలాంటి సంబంధం ఉండదని తెలిపారు. అభిమానం పేరుతో తాను ఇబ్బంది పడే పరిస్థితిని తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు అభిమానులు వ్యహారిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అభిమానులకు మనవి.. 33 ఏళ్లుగా నా కుటుంబం శ్రేయోభిలాషులుగా నా అభిమానులు కూడా తన ఎదుగుదలకు కారణమయ్యారని భావించానని జగపతి బాబు చెప్పుకొచ్చారు.
''అలాగే వాళ్ల ప్రతి కుటుంబ విషయాల్లో పాలు పంచుకుని వాళ్ల కష్టాల్ని నా కష్టాలుగా భావించి, వాళ్లకు తోడుగా ఉన్నాను. అభిమానులంటే అభిమానం, ప్రేమ ఇచ్చే వాళ్లని మనస్ఫూర్తిగా నమ్మాను. కానీ బాధకరమైన విషయం ఏంటంటే.. కొంతమంది అభిమానులు ప్రేమ కంటే ఆశించటం ఎక్కువైపోయింది. నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకువచ్చారు'' అని జగపతిబాబు చెప్పుకొచ్చారు.
''మనసు ఒప్పుకోకపోయినా బాధతో చెప్పాల్సిన విషయం ఏంటంటే.. ఇక నుంచి నా అభిమాన సంఘాలకు, ట్రస్ట్‌కి నాకు ఎలాంటి సంబంధం లేదు. విరమించుకుంటున్నాను. అయితే కేవలం ప్రేమించే అభిమానులకు నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను'' అని జగపతి బాబు తేల్చి చెప్పారు. మరోవైపు, నెటిజన్లు జగపతి బాబుకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆయన నిర్ణయం సమర్థనీయం అంటూ కామెంట్లు చేస్తున్నారు.