మాలీవుడ్‌ను కుదిపేస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఇప్పటివరకూ 17 కేసులు నమోదు
లైంగిక వేధింపుల ఆరోపణలు మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేసింది. ఇప్పటి వరకు 17 లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి
By Medi Samrat
లైంగిక వేధింపుల ఆరోపణలు మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేసింది. ఇప్పటి వరకు 17 లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. ఆరోపణల నేపథ్యంలో మలయాళ సినీ నటీనటుల సంఘం అమ్మా(AMMA) కూడా రద్దైంది. ఈ ఆరోపణలకు సంబంధించి మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సినీ నటులను, నిర్మాతలను పోలీసులు విచారించే అవకాశం ఉంది.
సినీ నటి సోనియా మల్హర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల పరంపరలో కొత్త ఆరోపణ వెలుగు చూసింది. 2013లో ఓ సినిమా సెట్స్‌లో ఓ నటుడు తనను వేధించాడని మల్హర్ ఆరోపించింది. కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు నటి తన ఫిర్యాదును దాఖలు చేసింది. మాలీవుడ్‌లో లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు కేరళ ప్రభుత్వం ఈ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. సోనియా మల్హర్ కంటే ముందు సినీ నటి మీను మునీర్ కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఇప్పుడు తనకు బెదిరింపు సందేశాలు వస్తున్నాయని మీను మునీర్ పేర్కొంది. ఈ విషయాన్ని మీనూ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ప్రత్యేక దర్యాప్తు బృందం త్వరలో మీను మునీర్ వాంగ్మూలాన్ని నమోదు చేసే అవకాశం ఉంది.
మలయాళ సినీ నటుడు సిద్ధిఖీపై కూడా లైంగిక ఆరోపణలు వచ్చాయి. 2016లో సిద్ధిఖీపై ఓ సినీ నటి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఈ ఘటనపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 376, 506 కింద కేసు నమోదు చేశారు. సిద్ధిఖీపై ఇది రెండో ఎఫ్ఐఆర్. మలయాళ చిత్ర పరిశ్రమలో పలువురు నటీనటులు, దర్శకులు, నిర్మాతలపై లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా ఉన్నాయి.
జస్టిస్ హేమ కమిటీ నివేదిక గత వారం వెలుగులోకి రావడంతో మలయాళ చిత్ర పరిశ్రమలోని కొంతమంది ప్రముఖులపై ఆరోపణల వెల్లువ మొదలైంది. మలయాళ చిత్ర పరిశ్రమను 10-15 మంది పురుష నిర్మాతలు, దర్శకులు, నటీనటులు నియంత్రిస్తున్నారని 235 పేజీల నివేదిక పేర్కొంది. ముగ్గురు సభ్యులతో కూడిన జస్టిస్ హేమ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం 2017లో ఏర్పాటు చేయగా.. 2019లో తన నివేదికను సమర్పించింది. నివేదిక విడుదలపై న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నందున ఇప్పటి వరకు బహిరంగపరచలేదు.