ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి కుటుంబంలో విషాదం నెలకొంది.ఆయన తండ్రి శివశక్తి దత్త (95) మంగళవారం ఉదయం కన్నుమూశారు. దత్తా పలు తెలుగు సినిమాలకు గీతాలు రచించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
శివశక్తి దత్తా అసలు పేరు కోడూరి సుబ్బారావు. 1932 అక్టోబరు 8న రాజమహేంద్రవరం సమీపంలోని కొవ్వూరులో జన్మించారు. చిన్నతనంలోనే కళలపై ఆసక్తి ఉన్న ఆయన.. ఇంటినుంచి వెళ్లిపోయి ముంబయిలోని ఓ ఆర్ట్స్ కాలేజీలో చేరారు. రెండేళ్ల తర్వాత కొవ్వూరుకు తిరిగొచ్చి కమలేశ్ అనే కలం పేరుతో చిత్రకారుడిగా పనిచేశారు. ఆ తర్వాత సంగీతంపై ఇష్టంతో గిటార్, సితార్, హార్మోనియం నేర్చుకున్నారు.
దత్తా ప్రముఖ దర్శకుడు రాజమౌళికి బాబాయ్ అవుతారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, కీరవాణి తండ్రి శివ శక్తి దత్త అన్నదమ్ములు. తండ్రి సినీ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న కీరవాణి టాలీవుడ్‌లో సంగీత దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాజమౌళి మొదటి చిత్రం నుంచి ఆర్ఆర్ఆర్ వరకు కీరవాణినే సంగీతం అందించారు.