Anand Muyida Rao : విషాదం.. మిథునం చిత్ర నిర్మాత క‌న్నుమూత‌

మిథునం చిత్ర నిర్మాత మొయిద ఆనంద‌రావు అనారోగ్యంతో క‌న్నుమూశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 March 2023 10:00 AM IST
Mithunam Producer Passed away, Mithunam Producer Anand Muyida Rao

మిథునం చిత్ర నిర్మాత మొయిద ఆనందరావు

టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. 'మిథునం' చిత్ర నిర్మాత మొయిద ఆనందరావు క‌న్నుమూశారు. ఆయ‌న‌ గ‌త‌కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. విశాఖ‌ప‌ట్నంలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో బుధ‌వారం తుది శ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌స్సు 57 సంవ‌త్స‌రాలు. ప‌లువురు టాలీవుడ్ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా నివాళులు అర్పిస్తున్నారు.

ఆనంద‌రావు స్వ‌గ్రామం విజ‌య‌న‌గ‌రం జిల్లా రేగిడి మండ‌లంలోని వావిల‌వ‌ల‌స‌. ఓ చిరు ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయ‌న వ్యాపార‌వేత్త‌గా ఎదిగారు. త‌న‌కు చేత‌నైనంత స‌మాజ సేవ చేసేవారు. స్వ‌గ్రామంలో గ్రంథాల‌యాన్ని ఏర్పాటు చేశారు. క‌విత్వాలు, ప‌ద్యాలు రాసి కోటీగాడు పేరుతో ప్ర‌చురించారు.

దివంగ‌త ఎస్పీ బాలసుబ్ర‌మ‌ణ్యం, ల‌క్ష్మీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తనికెళ్ళ భరణి ద‌ర్శ‌క‌త్వంలో "మిథునం" చిత్రాన్ని నిర్మించారు. 2012లో విడుద‌లైన ఈ చిత్రానికి 2017లో నంది అవార్డు వ‌చ్చింది. ఆనంద‌రావు మృతితో స్వ‌గ్రామంలో విషాదం అలుముకుంది. ఈ రోజు(గురువారం) ఆయ‌న అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయి.

Next Story