Malla Reddy : పవన్ కళ్యాణ్ చిత్రంలో విలన్‌గా మంత్రి మల్లారెడ్డికి ఆఫర్
ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో విలన్‌గా నటించాలని మంత్రి మల్లారెడ్డిని దర్శకుడు హరీశ్ శంకర్ కోరాడు.
By తోట వంశీ కుమార్ Published on 26 March 2023 2:05 PM IST
మేము ఫేమస్ చిత్ర టీజర్ కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి మల్లారెడ్డి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విలన్‌గా నటించాలని మంత్రి మల్లారెడ్డిని దర్శకుడు హరీశ్ శంకర్ కోరాడు. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి మల్లారెడ్డి తెలియజేశారు. దాదాపు గంటన్నర సేపు బ్రతిమిలాడాడని, అయినప్పటికీ తాను చేయనని చెప్పినట్లు మంత్రి తెలిపారు.
‘మేము ఫేమస్’ అనే చిత్ర టీజర్ వేడుకకు మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా గురించి, యూత్ గురించి పలు విషయాలను చెప్పి అక్కడ ఉన్న అందరిలో జోష్ నింపారు. ఈ చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రం సక్సెస్ అయ్యాక ఈ హీరోతో తానొక చిత్రాన్ని చేస్తానని, ఎన్నికలు అయిపోయిన తరువాత తెలంగాణ యాసలో పలు చిత్రాలు నిర్మిస్తానని మంత్రి మల్లారెడ్డి అన్నారు.
పవన్ చిత్రంలో విలన్‌గా అడిగారు..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో విలన్ క్యారెక్టర్ కోసం హరీష్ శంకర్ తనను సంప్రదించాడని మల్లారెడ్డి చెప్పారు. ఓ రోజు దర్శకుడు హరీష్ శంకర్ తన దగ్గరకి వచ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యిపోయావు అన్నా.. పవన్ తో నేను తీసే సినిమాలో విలన్ గా నటిస్తావా అన్నా అని అడిగాడు. దాదాపు గంటన్నర సేపు బ్రతిమిలాడాడాడు. అయితే.. తాను విలన్‌గా నటించనని చెప్పినట్లు మంత్రి మల్లారెడ్డి చెప్పారు.