హైదరాబాద్: అర్హులైన సినీ పరిశ్రమ కార్మికులకు హైదరాబాద్ చిత్రపురి కాలనీలో ఇళ్లు ఇప్పిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. చిన్న సినిమాలు తీసే వారికి థియేటర్లు ఇప్పించే బాధ్యత తనదని చెప్పారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార వేడుకల్లో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. తనకు సినిమాల అంటే చాలా ఇష్టం అని అన్నారు. రాష్ట్రంలో ప్రతిభావంతులైన ఆర్టిస్టులు, డైరెక్టర్లు, నిర్మాతలు ఉన్నారన్నారు. వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు.
పాన్ ఇండియా సినిమాలు తీసే సత్తా తెలంగాణ వారికీ ఉందన్నారు. లోకల్ టాలెంట్‌ను అందరూ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీలో 16,000 మంది సభ్యులు ఉన్నారని, వీరిలో చాలా మంది సభ్యులకు ఇళ్లు లేవని, ఇల్లు లేని సినీ కార్మికులకు ఇళ్లు మంజూరు చేయించాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోరగా.. దానికి మంత్రి హామీ ఇచ్చారు. చిత్రపురి కాలనీలో ఇళ్ల స్థలాలు ఇచ్చిన తర్వాతే తనకు సన్మానం చేయాలని మంత్రి అన్నారు.