టికెట్ రేట్లు సవరించినందుకు సీఎం కేసీఆర్ గారికి థ్యాంక్స్ : చిరంజీవి
Mega Star Chiranjeevi says thanks to CM KCR on ticket rates.తెలంగాణ రాష్ట్రంలోని థియేటర్లలో టికెట్ రేట్లను
By తోట వంశీ కుమార్ Published on 25 Dec 2021 12:24 PM ISTతెలంగాణ రాష్ట్రంలోని థియేటర్లలో టికెట్ రేట్లను పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం కొత్త జీవోను జారీ చేసిన సంగతి తెలిసిందే. నిర్మాతల విజ్ఞప్తి మేరకు రేట్ల పెంపుపై ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపగా వాటిని పరిశీలించిన ప్రభుత్వం టికెట్ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సినీ పరిశ్రమకు చెందిన వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సిని పరిశ్రమకు మేలు కలిగేలా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.
'తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీ దారులకు, థియేటర్ల యాజమాన్యానికి, అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి కృతజ్ఞతలు. సినిమా థియేటర్ల మనుగడకు, వేలాదిమంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది' అని చిరంజీవి ట్వీట్ చేశారు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోను దానికి జత చేశారు.
తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీదారులకు,థియేటర్ యాజమాన్యానికి అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ KCR గారికి కృతఙ్ఞతలు.🙏🏻🙏🏻 సినిమా థియేటర్ల మనుగడకు,వేలాదిమంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది. pic.twitter.com/w6VbRMtrG5
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 25, 2021
జీవో ప్రకారం.. ఏసీ, ఎయిర్ కూల్డ్ థియేటర్‌లలో సినిమా టికెట్ కనిష్ట ధర రూ.50 కాగా, గరిష్టంగా రూ.150గా నిర్ణయించారు. జీఎస్టీ అదనం. నాన్ ఏసీ థియేటర్లలో టికెట్ కనీస ధర రూ.30 కాగా.. గరిష్టంగా రూ.70గా నిర్ణయించారు. మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ కనీస ధర రూ.100+జీఎస్‌టీ.. గరిష్టంగా రూ.250+జీఎస్‌టీగా ఖరారు చేశారు. రిక్లైనర్స్ కోసం రూ.300+జీఎస్‌టీగా మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ రేట్ల ను నిర్ణయించారు. ఇవికాకుండా నిర్వహణ ఖర్చుల కింద టికెట్‌పై ఏసీ, ఎయిర్ కూల్డ్ థియేటర్లలో రూ.5, నాన్ ఏసీలలో రూ.3 వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించారు.