'మాస్టర్' మూవీ రివ్యూ

Master Movie Review.త‌మిళ సూప‌ర్ స్టార్ విజ‌య్‌కు ఉన్న క్రేజే వేరు. తాజాగా ఆయ‌న న‌టించిన చిత్రం 'మాస్ట‌ర్' మూవీ రివ్యూ.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Jan 2021 12:37 PM IST
Tamil Star Vijay New Movie Master review

నటీనటులు : విజయ్, విజయ్ సేతుపతి, మాళవిక మోహనన్ త‌దిత‌రులు

కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: లోకేష్ కనకరాజ్

నిర్మాత: జేవియర్ బ్రిట్టో

సంగీతం: అనిరుధ్

ఛాయాగ్రహణం: సత్యన్ సూర్యన్

త‌మిళ సూప‌ర్ స్టార్ విజ‌య్‌కు ఉన్న క్రేజే వేరు. త‌మిళంలోనే కాకుండా తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఆయ‌న న‌టించిన చిత్రం మాస్ట‌ర్‌. త‌మిళంలో ఈ చిత్రానికి పోటీ లేకున్న‌ప్ప‌టికి తెలుగులో మాత్రం పోటీ త‌ప్ప‌దు. లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈచిత్రంపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. అయితే.. విడుద‌ల‌కు రెండు రోజుల ముందు ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని సీన్లు ఆన్‌లైన్‌లో ద‌ర్శ‌నం ఇచ్చాయి. అన్నింటిని అధిగ‌మించి ఈ చిత్రం నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రీ అంచ‌నాల‌ను ఏ మేర‌కు అందుకుందో ఓ సారి చూద్దాం.

క‌థ : జేడీ (విజయ్) ఓ కాలేజీ ప్రొఫేస‌ర్‌. విద్యార్థుల్లో అత‌డికి మంచి పేరు ఉంటుంది. అయితే.. యాజ‌మాన్యంలో కొంద‌రు మాత్రం అత‌డికి వ్య‌తిరేకంగా ప‌నిచేస్తుంటారు. కాలేజీలో స్టూడెంట్ ఎల‌క్ష‌న్లు జ‌రిపించాల‌ని జేడీ ప‌ట్టుబ‌డ‌తాడు. అందుకు కాలేజీ యాజ‌మాన్యం కొన్ని ష‌ర‌తుల‌తో అంగీక‌రిస్తుంది. ఎన్నిక‌లు స‌జావుగా జ‌రిగినా..? జేడీ కాలేజీ వ‌దిలి వెళ్లిపోవాల్సి వ‌స్తుంది..? జువైనల్ అబ్జర్వేషన్ హోంలో ఉపాధ్యాయుడిగా పని చేయాల్సి వ‌స్తుంది. అక్క‌డ బాల నేర‌స్తుల్ని అడ్డుపెట్టుకుని భ‌వాని(విజ‌య్ సేతుప‌తి) అరాచ‌కాలు కొనసాగిస్తుంటాడు. మ‌రీ భ‌వాని ని జేడీ ఎలా ఎదుర్కొన్నాడు. జువైన‌ల్ హోంను గాడిలో పెట్టాడా..? కాలేజీ నుంచి అత‌ను ఎందుకు బ‌య‌టికి వెళ్లాల్సి వ‌చ్చింది. మాళ‌విక మోహ‌న్‌కు జేడీ ఉన్న సంబంధం వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేష‌ణ : ఈ చిత్రం ఆరంభం ఆసక్తికరంగా మొద‌లుపెట్టాడు ద‌ర్శ‌కుడు. రొటీన్‌గా హీరో పాత్ర ఇంట్రోతో సినిమాను మొదలుపెట్టకుండా.. విలన్ పాత్రను మంచి ఎలివేషన్ తో మొదలుపెట్టడం ఆకట్టుకుంటుంది. జువైనల్ హోంలోకి బాల నేరస్థుడిగా వచ్చిన విజయ్ సేతుపతి అక్కడి పరిస్థితుల నేపథ్యంలో కర్కశంగా తయారవడం, తర్వాత తనకు పైకి తెచ్చిన వాళ్లనే కబళించి పెద్ద గూండాగా ఎద‌గ‌డం చాలా చ‌క్క‌గా చూపించాడు. కాలేజీ సీన్లు కొంత వినోదాత్మకంగానే సాగినా కొత్తదనం ఏమీ కనిపించదు. కాలేజీ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో అనుకునేసరికి.. కథను మరోవైపుకి మళ్లించాడు దర్శకుడు. హీరో జువైనల్ హోంకు రావడం, అక్కడున్న గ్యాంగ్ అరాచకాలు, హీరోకు ఎదురయ్యే సవాళ్లు, ఈ నేపథ్యంలో తొలి గంట తర్వాత వేరే సినిమా చూస్తున్న భావన కలుగుతుంది. హీరోలో మార్పు తీసుకొచ్చే ఇంటర్వెల్ ఎపిసోడ్ సినిమాలో హైలైట్ గా నిలుస్తుంది. ఈ ఎపిసోడ్ ద్వితీయార్ధం మీద అంచనాలు పెంచుతుంది. కానీ ఆ తర్వాత రొటీన్ ఫార్మాట్లోకి వెళ్లిపోవడం నిరాశ కలిగిస్తుంది. చివర్లో హీరో, విలన్ మధ్య ప‌తాక స‌న్నివేశాలు మాస్‌ను మెప్పిస్తాయి కానీ.. అప్పటికే సినిమా మీద ఇంప్రెషన్ తగ్గిపోయిన సగటు ప్రేక్షకుడికి పతాక సన్నివేశం కూడా ఎలాంటి హై ఇవ్వదు.

విజయ్ తన అభిమానుల్ని అలరించేలా నటించాడు. అతడి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. విజయ్ సేతుపతి కు పెర్ఫామెన్స్ పరంగా సినిమాలో అగ్ర తాంబూలం దక్కుతుంది. హీరోయిన్ మాళ‌విక మోహ‌న్ ఉన్నంత‌లో ఫ‌ర్వాలేదు అని అనిపించింది. జువైనల్ హోంలో ఖైదీగా అర్జున్ దాస్ నటనకు కూడా మంచి మార్కులు పడతాయి. అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం ఆక‌ట్టుకుంటుంది. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్‌తో ఆక‌ట్టుకున్నాడు. సత్యన్ సూర్యన్ ఛాయాగ్రహణం బాగుంది. సినిమా అంతటా విజువల్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలకు ఢోకా లేదు.




Next Story