చిరంజీవి, పవన్ కళ్యాణ్ నాకే ఓటు వేస్తారు : మంచు విష్ణు
Manchu Vishnu files nomination in MAA elections.మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
By తోట వంశీ కుమార్ Published on 28 Sep 2021 8:39 AM GMTమూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. నిన్న ప్రకాశ్ రాజ్, ఆయన ప్యానెల్ సభ్యులు నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నేడు 'మా' అధ్యక్ష బరిలో ఉన్న మంచు విష్ణు..తన నివాసం నుంచి ఫిల్మ్‌ఛాంబర్ వరకు భారీ ర్యాలీగా వెళ్లారు. అనంతరం తన ప్యానల్‌తో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు.
మా ఎన్నికల్లో తమ ప్యానల్ గెలుస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు విష్ణు. ఒకటి లేదా రెండు రోజుల్లో తమ మేనిఫెస్టోను విడుదల చేస్తామన్నారు. మేనిఫెస్టో చూసిన అనంతరం చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లు కూడా తనకే ఓటు వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది తెలుగు సినీ నటుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం అని అన్నారు. మా ఎన్నికల్లో రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవద్దని తాను ముందే చెప్పానని.. కానీ ఏం జరుగుతుందో అందరికి తెలిసిందేనని అన్నారు. ఇక నాన్న గారి గురించి పవన్ కళ్యాణ్ అడిగిన ప్రతి ప్రశ్నకు తన తండ్రి మోహన్‌బాబు సమాధానం ఇస్తారని చెప్పారు. 10న ఎన్నికలు ముగియగానే.. 11న మీడియా సమావేశం పెట్టి మరీ మాట్లాడతారని చెప్పారు.
ఏపీ ప్రభుత్వ తీరుపై పవన్ కళ్యాణ్ మాట్లాడింది తాను పూర్తిగా వినలేదని.. కొన్ని పాయింట్లు మాత్రమే చదివానన్నారు. పవన్ చేసిన వ్యాఖ్యలకు మాకు ఎటువంటి సంబంధం లేదని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటన విడుదల చేసింది. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌనిల్స్ కూడా పవన్ వ్యాఖ్యలను ఏకీభవించడం లేదు. ఏపీ, తెలంగాణ రెండు కళ్లు అని వాళ్లు ప్రకటించారు. నేను కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో ఏకీభవించడం లేదని మంచు విష్ణు తెలిపారు.