శంషాబాద్ ఎయిర్‌పోర్టులో జైలర్‌ మూవీ విలన్ అరెస్ట్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పోలీసులు మలయాళ నటుడిని అరెస్ట్ చేశారు.

By Srikanth Gundamalla  Published on  8 Sep 2024 2:32 AM GMT
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో జైలర్‌ మూవీ విలన్ అరెస్ట్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పోలీసులు మలయాళ నటుడిని అరెస్ట్ చేశారు. గత సంవత్సరం మద్యం మత్తులో సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌పై మలయాళ నటుడు వినాయకన్‌ దాడికి పాల్పడ్డాడు. బాధిత కానిస్టేబుల్‌ ఈ మేరకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు అయ్యింది. ఇక తాజాగా అతను శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు శనివారం రాత్రి రావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ జైలర్‌ నటుడిని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోనే విచారిస్తున్నారు. అయితే.. ఈ అరెస్ట్‌పై వినాయకన్‌ కూడా స్పందించాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పాడు. ఇప్పటికే పలుమార్లు కూడా ఇదే విషయాన్ని గుర్తు చేశాడు. సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు తనని ఎయిర్‌పోర్టులోని ఓ గదిలోకి తీసుకెళ్లి దాడి చేశారని వినాయకన్ ఆరోపణలు చేశాడు. కావాలంటే సీసీ టీవీ ఫుటేజ్‌ చేసుకోవాలంటూ చెప్పాడు.

ఈ మలయాళ నటుడు ఇలా వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. గతేడాది అక్టోబర్‌ నెలలో కేరళ పోలీసులు కూడా వినాయకన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎర్నాకుళం టౌన్‌ నార్త్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మద్యం మత్తులో పలువురితో గొడవ పడ్డాడని ఫిర్యాదు రావడంతో అరెస్ట్ చేశారు. మద్యంమత్తులో తమ అపార్ట్‌మెంట్‌లో న్యూసెన్స్ చేస్తున్నాడని.. ఇబ్బందులు పెడుతున్నాడంటూ పొరుగువారు వినాయకన్‌పై పోలీసులకు కంప్లైంట్ చేశారు. అప్పుడు మొదట పోలీసులు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ.. వినాయకన్ వినకుండా అదే రీతిన వ్యహరించడంతో అరెస్ట్ చేసి పోలీస్‌ స్టేషన్‌ను తరలించారు. చిత్ర పరిశ్రమలో వినాయకన్‌ బాగానే సినిమాల్లో నటించారు. కొంత కాలం ముందు రజనీకాంత్‌ నటించిన జైలర్ సినిమాలో విలన్‌గా కూడా కనిపించాడు.



Next Story