'ప్రాజెక్ట్‌-కె'కి పోటీగా మహేష్‌ బాబు మూవీ

భారతదేశ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌ తెరకెక్కతున్న రెండు సినిమాల్లో ఒకటి ప్రభాస్‌ సినిమా కాగా, మరోకటి మహేష్‌ బాబు సినిమా

By అంజి  Published on  6 July 2023 1:57 PM IST
Mahesh Babu, Prabhas, Project K movie, Tollywood

'ప్రాజెక్ట్‌-కె'కి పోటీగా మహేష్‌ బాబు మూవీ 

ఒకప్పటి టాలీవుడ్‌ వేరు.. ఇప్పటి టాలీవుడ్‌ వేరు. సినిమా ఇండస్ట్రీలో బడ్జెట్‌తో పాటు అన్ని లెక్కలు మారిపోయాయి. అసలు ఇప్పుడు సినిమాకు ఎంత ఖర్చు పెట్టామన్నది.. కాదు ఎంత వచ్చిందన్నదే లెక్కలో తీసుకుంటున్నారు. స్టోరీ బాగుండాలనే కానీ.. ఎంతైనా పెట్టుబడి పెట్టి సినిమాలు తీస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు.. స్టోరీలో సత్తా ఉంటే ఎంతైనా రాబట్టొచ్చు అనే దాన్ని నిజం చేసి చూపించాయి. ఒకప్పుడు సినిమాకు 100 కోట్లు రూపాయలు పెట్టుబడి పెట్టి తీస్తే వామ్మో అనుకునేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. వంద కోట్లు కాదు.. వందల కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు. ప్రభాస్‌ 'ఆదిపురుష్‌' సినిమాకు ఏకంగా రూ.500 నుంచి రూ.600 కోట్లు ఖర్చు చేశారని సినిమా ఇండస్ట్రీలో టాక్‌ ఉంది. ఇక రాంచరణ్, ఎన్టీఆర్‌ నటించిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా రూ.400 కోట్లకుపైనే.

వీటికంటే భారీ బడ్జెట్‌తో మరో రెండు సినిమాలు తయారవుతున్నాయి. ఇవి భారతదేశ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌ తెరకెక్కతున్న సినిమాలు. వీటిలో ఒకటి ప్రభాస్‌ సినిమా కాగా, మరోకటి మహేష్‌ బాబు సినిమా. ప్రభాస్‌ మెయిన్‌ లీడ్‌గా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న సినిమా 'ప్రాజెక్ట్‌ కె'. దీని బడ్జెట్‌ లెక్కలు ఇప్పటి వరకూ తేలలేదు. ఇప్పటి వరకైతే మనదేశంలో భారీ బడ్జెట్‌ చిత్రం అంటే ఇదే. ఈ మూవీ కోసం రూ.700 కోట్ల నుంచి రూ.800 కోట్లు ఖర్చుపెడుతున్నారని సమాచారం. ప్రభాస్‌తో పాటు కమల్‌హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకునే వంటి పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఈ మూవీలో నటిస్తున్నారు. ఈ లెక్కన అంత ఖర్చు పెట్టడంలో కూడా తప్పు లేదనిపిస్తోంది. హాలీవుడ్‌ని టార్గెట్‌ చేస్తోన్న ఈ సినిమా విషయంలో అంతా అనుకున్నట్టు జరిగితే కనీసం రూ.1000 కోట్లు రాబట్టే అవకాశం ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నారు. రెండు పార్టులుగా సినిమా వచ్చే ఛాన్స్‌ ఉంది.

ఇక ప్రభాస్‌ 'ప్రాజెక్ట్‌ కె'ని తలదన్నేలా మహేష్‌ బాబు, రాజమౌళి మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమా బడ్జెట్‌.. ప్రాజెక్ట్‌ కె బడ్జెట్‌కు రెండింతలు పైనే ఉంటుందని టాక్. ఈ సినిమాకు ఏకంగా రూ.1500 కోట్ల పెట్టుబడి పెడుతున్నారట. 'ప్రాజెక్ట్‌ కె' మాదిరిగానే మహేష్‌ బాబు సినిమాలో కూడా పెద్ద పెద్ద స్టార్‌ సెలబ్రిటీలు ఉండనున్నారట. అందులోనూ రాజమౌళి డైరెక్టర్‌.. ఆయన అడిగితే ఎవరూ కాదంటారు. ఎంతటి స్టార్‌ అయినా నటించడానికి ఒప్పుకుంటారు. ఆర్‌ఆర్‌ఆర్‌, బాహుబలి సినిమాలతో రాజమౌళికి ఇంటర్నేషనల్‌ బ్రాండ్‌ ఏర్పడింది. ఆయనకు మహేష్‌ బాబు తోడయ్యాడు. ఈ సారి హాలీవుడే లక్ష్యంగా చేసుకుని ఈ సినిమా రూపొందిస్తున్నాడు రాజమౌళి. ఇంగ్లీష్‌ వెర్షన్‌ కూడా సిద్ధం చేస్తున్నారట. భారీ ప్రాజెక్ట్ కావడంతో పలువురు నిర్మాతలు.. ఈ సినిమాలో భాగం కాబోతున్నారు. ఇప్పటివరకైతే 'ప్రాజెక్ట్ కె' అత్యంత ఖరీదైన సినిమా. ఈ సినిమాను బడ్జెట్‌ విషయంలో రాజమౌళి బ్రేక్‌ చేయనున్నారు. ఏదీ ఏమైనా రెండు కూడా తెలుగు సినిమాలే.

Next Story