మ‌హేష్‌బాబు కుటుంబంలో తీవ్ర విషాదం.. సోద‌రుడు రమేష్‌ బాబు కన్నుమూత

Mahesh Babu's brother Ramesh Babu passes away.టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్‌ బాబు కుటుంబంలో తీవ్ర విషాదం నెల‌కొంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Jan 2022 2:34 AM GMT
మ‌హేష్‌బాబు కుటుంబంలో తీవ్ర విషాదం.. సోద‌రుడు రమేష్‌ బాబు కన్నుమూత

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్‌ బాబు కుటుంబంలో తీవ్ర విషాదం నెల‌కొంది. సూప‌ర్ స్టార్ కృష్ణ త‌న‌యుడు మ‌హేష్‌బాబు సోద‌రుడు ఘ‌ట్ట‌మ‌నేని ర‌మేష్‌బాబు క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌స్సు 56 సంవ‌త్స‌రాలు. గ‌త కొంత‌కాలంగా ఆయ‌న కాలేయ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. శ‌నివారం తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురికావ‌డంతో కుటుంబ స‌భ్యులు ఆయ‌న్ను గ‌చ్చిబౌలిలోని ఏఐజీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే.. ఆయ‌న మార్గ‌మ‌ధ్యంలోనే ఆయ‌న తుదిశ్వాస విడిచారు. ఈరోజు రమేష్‌బాబు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మధ్యహ్నం హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో రమేష్‌బాబు అంత్యక్రియలు జ‌ర‌గ‌నున్నాయి. ఆయ‌న మృతితో టాలీవుడ్‌లో విషాదఛాయ‌లు అలుముకున్నాయి. కాగా.. మహేశ్ బాబుకు కరోనా సోకడంతో ప్ర‌స్తుతం ఐసోలేషన్ లో ఉన్నారు.

1974లో 'అల్లూరి సీతారామ‌రాజు' చిత్రంతో బాల‌న‌టుడిగా వెండితెర‌కు ప‌రిచ‌యం అయ్యారు ర‌మేష్‌బాబు. ఆ త‌రువాత 'మెస‌గాళ్ల‌కు మోస‌గాడు', 'దేవుడు చేసిన మ‌నుషులు' చిత్రాల్లో బాల‌న‌టుడిగా న‌టించి మెప్పించారు. 'సామ్రాజ్' చిత్రంతో హీరోగా మారారు. 'నా ఇల్లే నా స్వ‌ర్గం', 'అన్నా చెల్లెలు', 'ప‌చ్చ‌తోర‌ణం', ముగ్గురు కొడుకులు', 'చిన్ని కృష్ణుడు', 'కృష్ణ‌గారి అబ్బాయి', 'బ‌జార్ రౌడీ', 'క‌లియుగ క‌ర్ణుడు', 'బ్లాక్‌టైగ‌ర్‌', 'ఆయుధం', 'క‌లియుగ అభిమ‌న్యుడు' త‌దిత‌ర చిత్రాల్లో న‌టించారు. తండ్రి కృష్ణ‌, సోద‌రుడు మ‌హేష్‌బాబుతో క‌లిసి ప‌లు చిత్రాల్లో న‌టించారు. చివ‌ర‌గా ఆయ‌న తండ్రి కృష్ణ‌తో క‌లిసి 'ఎన్‌కౌంట‌ర్' చిత్రంలో న‌టించారు. ఇక 1997 నుంచి ర‌మేష్‌బాబు న‌ట‌నకు దూరంగా ఉన్నారు. 2004లో నిర్మాత‌గా మారారు. మహేశ్ బాబు నటించిన 'అర్జున్‌', 'అతిథి' సినిమాలను నిర్మించారు. మహేశ్ కెరీర్ లో భారీ హిట్ అనదగ్గ 'దూకుడు' చిత్రానికి ఆయన సమర్పకుడిగా వ్యవహరించారు.

అభిమానుల‌కు ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీ విజ్ఞ‌ప్తి..

ర‌మేష్‌బాబు మృతి ప‌ట్ల ఘ‌ట్ట‌మ‌నేని కుటుంబం ప్ర‌గాఢ సంతాపం తెలిపింది. రమేష్‌ బాబు భౌతికకాయానికి నివాళులర్పించేందుకు అభిమానులు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులకు ఘట్టమనేని ఫ్యామిలీ ఓవిజ్ఞ‌ప్తి చేసింది. రమేష్‌బాబు మరణించారని ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. ఆయన ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతారు. అయితే.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, మా శ్రేయోభిలాషులందరినీ కొవిడ్ నిబంధనలకు కట్టుబడి, దహన సంస్కారాల స్థలంలో గుమికూడకుండా ఉండాలని మేము అభ్యర్థిస్తున్నాం అంటూ.. ఈ మేరకు ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీ ఓ ప్రకటన విడుదల చేసింది.


Next Story