ఆ సినిమాను థియేటర్లలో విడుదల చేశారో: రాజ్ థాకరే వార్నింగ్

పాకిస్థానీ సినిమా 'ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్' భారతదేశంలో అక్టోబర్ 2న విడుదల కానుంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Sep 2024 10:45 AM GMT
ఆ సినిమాను థియేటర్లలో విడుదల చేశారో: రాజ్ థాకరే వార్నింగ్

పాకిస్థానీ సినిమా 'ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్' భారతదేశంలో అక్టోబర్ 2న విడుదల కానుంది. చాలా ఏళ్ల తర్వాత పాకిస్థాన్ సినిమా భారతదేశంలో విడుదల అవుతూ ఉండడంతో కాస్త టెన్షన్ నెలకొంది. ఈ సినిమా 2022లోనే థియేటర్లలో విడుదలై భారీ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమాను భారతదేశంలో విడుదల చేయాలని చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే అది వీలు పడడం లేదు. ఎట్టకేలకు ఈ ఏడాది అక్టోబర్ 2న భారత్ లో సినిమాను విడుదల చేయాలని ఫిక్స్ అవ్వగా సినిమాను విడుదల చేస్తే థియేటర్లను తగలబెట్టేస్తామంటూ బెదిరింపులు ఎదురవుతూ ఉన్నాయి.

మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్ థాకరే ఆ చిత్రాన్ని మహారాష్ట్రలో విడుదల చేయనివ్వబోమని, థియేటర్‌ యజమానులు స్క్రీనింగ్‌ను అనుమతిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజ్ థాకరే తన ట్వీట్ లో కళకు సరిహద్దులు లేవని, భారతదేశంలో పనిచేస్తున్న పాకిస్తానీ నటుల విషయంలో ఇది వర్తించదని అన్నారు. పాకిస్థానీ నటుడు ఫవాద్‌ ఖాన్‌ నటించిన 'ది లెజెండ్‌ ఆఫ్‌ మౌలా జట్‌' చిత్రం త్వరలో భారత్‌లో విడుదల కానుంది. మహారాష్ట్రలో సినిమాను ఎట్టిపరిస్థితుల్లోనూ విడుదల చేసేందుకు ఎంఎన్ఎస్ అనుమతించదన్నారు. పాకిస్థానీ నటుల సినిమాలను భారతదేశంలో ఎందుకు విడుదల చేయడానికి అనుమతిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రాజ్ థాకరే. కళకు సరిహద్దులు లేవు, ఇది ఇతర సందర్భాల్లో మంచిది కానీ పాకిస్తానీ నటుల విషయంలో ఇది అస్సలు పని చేయదన్నారు. మహారాష్ట్రలోనే కాకుండా దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రభుత్వాలు అనుమతించకూడదని డిమాండ్ చేశారు.

MNS హెచ్చరించినా పట్టించుకోకుండా సినిమా ప్రదర్శనకు ముందుకు వెళితే థియేటర్ యజమానులపై చర్యలు తీసుకుంటామని రాజ్ ఠాక్రే హెచ్చరించారు. ఇంతకు ముందు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు MNS ఏమి చేసిందో అందరికీ గుర్తుంటుంది, కాబట్టి థియేటర్ యజమానులు చిక్కుల్లో పడవద్దని అభ్యర్థిస్తున్నట్లు తెలిపారు రాజ్ థాకరే. ఈ సినిమా విడుదలయ్యే సమయానికి నవరాత్రి ఉత్సవాలు మొదలవుతాయి.. మహారాష్ట్రలో ఎలాంటి గొడవలు జరగకూడదనుకుంటున్నానని తెలిపారు.

Next Story