మంచు విష్ణు విజయం.. చిరంజీవి అభినందనలు.. నాగబాబు షాకింగ్ నిర్ణ‌యం

MAA Elections Update. హోరాహోరీగా సాగిన ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు ఘన విజయం సాధించిన విష‌యం తెలిసిందే.

By Medi Samrat  Published on  11 Oct 2021 1:50 AM GMT
మంచు విష్ణు విజయం.. చిరంజీవి అభినందనలు.. నాగబాబు షాకింగ్ నిర్ణ‌యం

హోరాహోరీగా సాగిన 'మా' ఎన్నికల్లో మంచు విష్ణు ఘన విజయం సాధించిన విష‌యం తెలిసిందే. ప్రకాశ్‌రాజ్‌పై 107 ఓట్ల తేడాతో మంచు విష్ణు గెలుపొందారు. విష్ణుకు 381 ఓట్లు రాగా, ప్రకాశ్‌రాజ్‌కు 274 ఓట్లు వచ్చాయి. 'మా' చరిత్రలోనే అత్యధిక పోలింగ్‌ నమోదైంది. 'మా'లో మొత్తం 883 మందికి ఓటు హక్కు ఉండగా వారిలో 665మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదిలావుంటే.. 'మా' నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణుకు చిరంజీవి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు.

''మా' నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణుకి, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీకాంత్‌, మిగతా విజేతలందరికీ పేరు పేరునా నా అభినందనలు. ఈ నూతన కార్యవర్గం మూవీ ఆర్టిస్టులందరి సంక్షేమానికి పాటుపడుతుందని ఆశిస్తున్నాను. 'మా' ఇప్పటికీ ఎప్పటికీ ఒకటే కుటుంబం. ఇందులో ఎవరు గెలిచినా మన కుటుంబం గెలిచినట్టే. ఆ స్ఫూర్తితోనే ముందుకు సాగుతామని నమ్ముతున్నాను' అని చిరంజీవి పేర్కొన్నారు.

ఇక ప్ర‌కాశ్‌రాజ్‌కు మ‌ద్ద‌తు తెలిపిన మెగాబ్ర‌ద‌ర్ నాగబాబు 'మా' సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మంచు విష్ణు గెలిచిన కాసేపటికే నాగబాబు ఈ నిర్ణయం తీసుకొని ఒక్కసారిగా షాక్‌ ఇచ్చారు. ప్రాంతీయవాదం, సంకుచిత మనస్తత్వంతో 'మా' కొట్టుమిట్టాడుతోందని, ఇలాంటి అసోసియేషన్‌లో కొనసాగడం ఇష్టంలేకే రాజీనామా చేస్తున్నట్లు నాగబాబు పేర్కొన్నారు. 48 గంటల్లో రాజీనామాను 'మా' కార్యాలయానికి పంపుతానన్నారు.


Next Story