టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ కన్నుమూత
Lyricist Kandikonda Yadagiri passed away.టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీగేయ రచయిత
By తోట వంశీ కుమార్ Published on 12 March 2022 11:33 AM GMT
టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీగేయ రచయిత కందికొండ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 49 సంవత్సరాలు. ఆయన మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఒక మంచి గేయ రచయితను కోల్పోయామని కామెంట్లు పెడుతున్నారు.
తెలుగు సినీ గేయ రచయితగా కందికొండకు మంచి పేరుంది. ఆయన పూర్తి పేరు కందికొండ యాదగిరి. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లెలో కుమ్మరి కుటుంబంలో జన్మించారు కందికొండ యాదగిరి. 2001లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' చిత్రంలో చక్రి సంగీత సారథ్యంలో "మళ్లీ కూయవే గువ్వా" పాటతో సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. 20ఏళ్ల ప్రస్థానంలో 1300కుపైగా పాటలు రాసి మంచి రచయితగా పేరు తెచ్చుకున్నారు.' ఇడియట్' చిత్రంలోని చూపుల్తో' గుచ్చి గుచ్చి', 'సత్యం' చిత్రంలో 'మధురవే మధురవే', 'పోకిరి'లో 'గల గల పారుతున్న గోదావరి', 'జగడమే', 'లవ్‌లీ'సినిమాలో 'లవ్‌లీ లవ్‌లీ' తదితర పాటలు మంచి పేరును తెచ్చిపెట్టాయి. చివరిగా 2018లో 'నీది నాది ఒకే కథ'లో రెండు పాటలు రాశారు. తెలంగాణ పండుగలైన బోనాలు, బతుకమ్మతోపాటు రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే పలు పాటలను కందికొండ రాశారు.