'నాటు నాటు' పాట.. నా బాల్య జ్ఞాపకాల నుంచి పుట్టుకొచ్చింది: చంద్రబోస్
Lyricist Chandra Bose said that the song 'Naatu Naatu' was born from my childhood memories. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదలై చాలా రోజులు అవుతున్న
By అంజి Published on 25 Jan 2023 10:26 AM ISTదర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదలై చాలా రోజులు అవుతున్న.. ఇప్పటికీ వరల్డ్ వైడ్‌గా రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా మంగళవారం నాడు సాయంత్రం ఆస్కార్ 2023 అవార్డుల నామినేషన్స్‌కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట ఎంపికైంది. టాప్ ఐదు పాటల్లో ఒకటిగా నిలిచింది. ఇంత వరకు ఏ ఇండియన్ సాంగ్, ముఖ్యంగా తెలుగు సాంగ్ ఇంత వరకు ఆస్కార్ నామినేషన్‌కు వెళ్లలేదు. తాజా ఘనతతో ఎంఎం కీరవాణి, ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్ సరికొత్త చరిత్ర సృష్టించారు.
నాటు నాటు పాటకు ఎంఎం కీరవాణి స్వరపరచగా, చంద్రబోస్ లిరిక్స్ రాశారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేసిన నాటు నాటు పాట ప్రపంచవ్యాప్తంగా ప్రజల అభిమానాన్ని పొందింది. జనవరి 24న, నాటు నాటు ఆస్కార్స్ 2023లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా నామినేట్ చేయబడింది. నామినేషన్ పొందిన తరువాత గీత రచయిత చంద్రబోస్, అతని భార్య, కొరియోగ్రాఫర్ అయిన సుచిత్ర మాట్లాడుతూ.. తమ ఉత్సాహాన్ని పంచుకున్నారు. ఈ పాట తన గ్రామం, బాల్యం, కుటుంబ నేపథ్యానికి సంబంధించినదని చంద్రబోస్ తెలిపారు.
చంద్రబోస్ మాట్లాడుతూ.. "నేను చాలా సంతోషంగా ఉన్నాను. కీరవాణి సర్, రాజమౌళి సర్‌లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న పల్లెటూరి నుంచి, సామాన్యమైన నేపథ్యం నుంచి వచ్చిన నాకు ఇది గొప్ప విజయం" అని అన్నారు. నాటు నాటు పాట రాయడానికి చాలా సమయం పట్టిందని చంద్రబోస్ వెల్లడించారు. "పాటలో ఏది రాసినా అది నా గ్రామం, నా బాల్యం, కుటుంబ నేపథ్యం. నా భావాలు, జ్ఞాపకాల్లోంచి పుట్టుకొచ్చిందేనని" అన్నారు.
ఆస్కార్ నామినేషన్ గురించి మాట్లాడుతూ.. "ఇది నాకు నమ్మశక్యం కానిది. లిస్ట్‌లో 15 పాటలు ఉన్నాయి. వాటిలో నాటు నాటు ఒకటి. అవతార్, నాటు నాటు పాటల మధ్య పోటీ ఉందని నేను అనుకున్నాను. అయితే, అవతార్‌లోని పాట రాలేదు. నాటు నాటు టాప్ 5లో ఉంది" అని అన్నారు.
ఎస్‌ఎస్ రాజమౌళి 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా అనేది ఇద్దరు తెలుగు స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ జీవితాల ఆధారంగా రూపొందించబడిన కల్పిత కాలపు నాటకం. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలోని నాటు నాటు పాటను ఎంఎం కీరవాణి స్వరపరిచారు. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పాడారు. ఈ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా గోల్డెన్ గ్లోబ్స్ 2023ని గెలుచుకుంది. ఆస్కార్ నామినేషన్ పొందిన తర్వాత, మార్చి 12న జరిగే అవార్డు వేడుకలో ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటు నాటు ప్రదర్శించబడుతుంది.