అనంత శ్రీరామ్.. పరిచయం అక్కరలేని పేరు. లిరిసిస్ట్ గా ఎన్నో గొప్ప గొప్ప పాటలు రాశారు. తాజాగా అనంత శ్రీరామ్ సొంత సినిమా పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన "హైందవ శంఖారావం" సభలో అనంత శ్రీరామ్ భారతీయ సినిమాల్లో హిందూ మతాన్ని తక్కువ చేసి చిత్రీకరిస్తున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభాస్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా కల్కి 2898 AD గురించి ప్రస్తావించాడు.
హిందూ సాహిత్యానికి మూలస్తంభాలైన రామాయణం, మహాభారతాలు వినోద ప్రయోజనాల కోసం తరచుగా తప్పుగా చూపిస్తున్నారని శ్రీరామ్ ఎత్తి చూపారు. ఎన్నో సంవత్సరాల నుండి విడుదలైన సినిమాలు, నిన్న మొన్న విడుదలైన కల్కి సినిమా వరకు కర్ణుడుకి అనవసరంగా గొప్పతనాన్ని ఆపాదించారని, ఇది చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా సిగ్గుపడుతున్నానన్నారు అనంత శ్రీరామ్. అప్పుటి సినిమా దర్శకులు, ఇప్పటి సినిమా నిర్మాతలు కృష్ణా జిల్లాకు చెందిన వారని, అదే గడ్డ మీద నిలబడి చెబుతున్నా, పొరపాటును.. పొరపాటు అని చెప్పకపోతే హైందవ ధర్మంలో పుట్టినట్టు కాదని, హైందవ ధర్మాన్ని ఆచరించినట్టు కాదన్నారు అనంత శ్రీరామ్. కర్ణుడిని వీరుడు సూరుడు అంటే హైందవ సమాజం ఎలా ఒప్పుకుంటుందని అనంత శ్రీరామ్ ప్రశ్నించారు.