తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు చాలా కఠినంగా లాక్‌డౌన్ నిబంధనలను అమలు చేస్తున్నారు. అత్యవసరాలకు పర్మిషన్ ఉన్నా.. వేరే ఇతర పనులు ఉన్నవారికి మాత్రం ఈ పాస్ ఉంటేనే అనుమతిస్తున్నారు. అయితే.. టాలీవుడ్ హీరో నిఖిల్ కు కూడా లాక్‌డౌన్ కారణంగా పోలీసుల నుండి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ విషయాన్ని నిఖిల్ ట్వీట్ చేయడంతో బయటికి వచ్చింది.
వివరాళ్లోకెళితే.. కరోనా బాధితులకు సాయం చేద్దామనుకున్న నిఖిల్.. ఓ కరోనా బాధితుడికి మందులు ఇచ్చేందుకు వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఉప్పల్ నుండి కిమ్స్ మినిస్టర్స్ రోడ్డులో ప్రయాణిస్తున్న సమయంలో కారుని ఆపేశారని, బాధితుడి వివరాలు, వైద్యులు రాసిన మందుల చీటి చూపించినా వెళ్లేందుకు అనుమతించలేదని, ఈ పాస్ ఉండాల్సిందేనని అంటున్నారని ట్వీట్ చేశారు. అయితే ఈ పాస్ కోసం తాను 9సార్లు సంప్రదించగా సర్వర్ డౌన్ కావడంతో దొరకలేదని.. అయినా మెడికల్ ఎమర్జెన్సీకి అనుమతి ఉందనుకుంటా.. అని రాసుకొచ్చారు. అయితే.. దీనిపై హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగం స్పందించినట్లు సమాచారం.