'లైగర్' మనీలాండరింగ్ కేసు.. ఈడీ ముందుకు హీరో విజయ్ దేవరకొండ
'Liger' money laundering probe.. Vijay Devarakonda appears before ED. ప్రముఖ టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరయ్యారు.
By అంజి Published on 30 Nov 2022 2:24 PM ISTప్రముఖ టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరయ్యారు. తాను ఇటీవలి నటించిన చిత్రం 'లైగర్' నిర్మాణం కోసం పెట్టిన ఖర్చుకు సంబంధించిన వివరాల గురించి విజయ్‌ను ఈడీ ప్రశ్నిస్తోంది. హైదరాబాద్‌లోని ఏజెన్సీ ప్రాంతీయ కార్యాలయంలో ఈడీ అధికారుల ముందు విజయ్ హాజరయ్యారు. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘనపై కేంద్ర ఏజెన్సీ దర్యాప్తు చేస్తోంది. ఈ సినిమా నిర్మాణంలో హవాలా కోణంపై అధికారులు కూపీ లాగుతున్నారు.
సినిమాలో విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్, అమెరికన్ బాక్సర్ మైక్ టైసన్‌తో సహా ఇతర నటులకు చెల్లించిన చెల్లింపుల గురించి ప్రశ్నిస్తున్నారు. ఈడీ అధికారులు నవంబర్ 17న చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి, నిర్మాత ఛార్మి కౌర్‌ను కూడా విచారించారు. ఈ ఏడాది ఆగస్టులో విడుదలైన హిందీ-తెలుగు సినిమా 'లైగర్'కి పెట్టుబడి మూలం గురించి వారిని ప్రశ్నించారు. మైక్ టైసన్ కూడా ఈ చిత్రంలో పొడిగించిన అతిథి పాత్రలో నటించారు. దాదాపు రూ. 125 కోట్ల బడ్జెట్‌తో నిర్మించినట్లు సమాచారం.
విజయ దేవరకొండ, అనన్య పాండే కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం లాస్‌వేగాస్‌లో మెగా షూటింగ్ జరుపుకుంది. అయితే అది బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. సందేహాస్పదమైన మార్గాల్లో సినిమాకు పెట్టుబడి పెట్టడంపై కాంగ్రెస్ నేత బక్కా జడ్సన్ ఫిర్యాదు చేయడంతో ఈడీ విచారణ చేపట్టింది. రాజకీయ నాయకులు కూడా లైగర్ సినిమాలో పెట్టుబడులు పెట్టారని బక్కా జడ్సన్ ఫిర్యాదు చేశారు. పెట్టుబడిదారులు తమ నల్లధనాన్ని తెల్లగా మార్చుకోవడానికి ఇదే సులువైన మార్గమని ఆయన పేర్కొన్నారు.
ఫెమాను ఉల్లంఘించి విదేశాల నుంచి సినిమా నిర్మాణానికి కోట్లాది రూపాయల పెట్టుబడులు వచ్చాయని వచ్చిన ఆరోపణలపై ఈడీ అధికారులు దర్శక, నిర్మాతలను ప్రశ్నిస్తున్నారు. పలు కంపెనీలు చిత్ర నిర్మాతల ఖాతాలకు నిధులు బదిలీ చేసినట్లు దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. మైక్ టైసన్, సాంకేతిక సిబ్బందితో సహా విదేశీ నటులకు డబ్బు పంపిన వారి వివరాలను, చెల్లింపులు ఎలా జరిగాయో తెలియజేయాలని వారిని కోరారు. కాగా, లైగర్ హిందీ వెర్షన్ కు కరణ్ జొహార్ కూడా నిర్మాతగా వ్యవహరించారు.